
ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, (ఇన్‌సెట్) యూనివర్సిటీ ప్రధాన గేటుకు వేసిన తాళం
రాయదుర్గం: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సెగ హైదరాబాద్‌కూ తాకింది. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు సాగాయి. విద్యార్థులు క్యాంపస్‌లో బైఠాయించి ఆదివారం అర్ధరాత్రి నుంచి కొనసాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు. సోమవారం ఉదయం క్యాంపస్‌లో విధులు నిర్వహించేందుకు ఉదయం 10 గంటలకు వచ్చిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బందిని విద్యార్థులు అడ్డుకున్నారు.
గేటు తాళం వేసి ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అలా మధ్యాహ్నం వరకు సిబ్బంది బయటే వేచి చూడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు విశ్వవిద్యాలయం వద్ద భారీగా మోహరించారు. కాగా, ఉర్దూ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఏఏ ఉపసంహరించాలి
కేంద్ర ప్రభుత్వం వెంటనే సీఏఏను ఉçపసంహరించుకోవాలని ‘మనూ’విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమర్‌ఫారూఖ్ డిమాండ్ చేశారు. త్వరలో తీసుకురావాలని అనుకుంటున్న ఎన్‌ఆర్‌సీ బిల్లు ఆలోచన కూడా విరమించుకోవాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీల్లో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్య కాండను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.