అంతా..ఓపెన్‌

Mass Copying In Open Inter And Tenth Exams - Sakshi

ఓపెన్‌ ఇంటర్, టెన్త్‌ పరీక్షల్లో అక్రమాలు

ఒకరికి బదులు మరొకరు

పరీక్ష రాస్తూ పట్టుపడుతున్న వైనం

మొన్న నర్సంపేట, నిన్న పరకాలలో వెలుగులోకి..

సంవత్సరాల తరబడి ‘చూచిరాత’

కాసులు ఇస్తే పాస్‌ గ్యారెంటీ

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

ఓపెన్‌ ఇంటర్, టెన్త్‌ పరీక్షలు అంతా ‘ఓపెన్‌’గానే జరుగుతున్నాయి. ఇంతకాలం మాస్‌కాపీయింగ్‌ యథేచ్ఛగా కొనసాగింది.. అది కొత్తపుంతలు తొక్కి ఏకంగా.. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే స్థాయికి చేరుకోవడం ఆ శాఖ అధికారులనిర్లక్ష్యాని కి నిదర్శనంగా నిలుస్తోంది.

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఓపెన్‌ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇంటర్‌ 1,047, టెన్త్‌లో 669 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. టీఎస్‌డబ్ల్యూ గురుకులంలో 197 మంది, నర్సంపేట జిల్లా పరిషత్‌ బాలుర, బాలిక పాఠశాలలో 472 టెన్త్‌ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 488, నర్సంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జిల్లా పరిషత్‌ మోడల్‌ పాఠశాలలో 582 మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

మూడు పువ్వులు..ఆరు కాయలు..
జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల అక్రమ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అభ్యర్థుల ప్రవేశాల నుంచే పాస్‌ గ్యారెంటీ అని హామీ ఇస్తూ పరీక్ష ఫీజులు తీసుకునేప్పటి నుంచి పైసలు లాగడం ప్రారంభిస్తున్నారు. హాల్‌ టికెట్‌ ఇచ్చేప్పుడే సెంటర్‌ నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు వసులు చేశారని సమాచారం. ‘అంతా మావాళ్లే ఉంటారు.. డబ్బులు ఇస్తే మీరు బుక్కులు పెట్టి రాసుకున్నా ఎవరూ ఏమీ అనరు’.. అని చెబుతూ పరీక్ష రాసే అభ్యర్థులను బుట్టలో వేసుకుంటున్నారు. అభ్యర్థులకు దగ్గరే ఉండి చిట్టీలు అందించడంతోపాటు ఒకరికి బదులుఇంకోకరితో పరీక్ష రాయిస్తున్నారు. ఇన్విజిలేటర్లు సైతం ఒక్కో పరీక్ష రూ.300 నుంచి రూ.500 వరకు వసులు చేస్తున్నారని సమాచారం.

వాట్సప్‌లలో పరీక్ష పత్రాలు
పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే పరీక్ష పేపర్‌ వాట్సప్‌ ద్వారా బయటకు వస్తుంది. దీంతో ఆయా ఓపెన్‌ స్కూల్‌ సెంటర్ల నిర్వాహుకులు వాటికి సంబంధించిన జవాబులను తయారు చేసుకుని జీరాక్స్‌ పేపర్లను లోపలికి పంపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఒక గంటలో పరీక్ష పూర్తి చేసి బయటకు వస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాసేవారు, ఇన్విజిలేటర్లు సెల్‌ ఫోన్‌లు వాడొద్దని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకున్నవారే లేరు.

పట్టుబడుతున్న అభ్యర్థులు
ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాస్తూ.. మాస్‌ కాపియింగ్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఈనెల 17న నర్సంపేటలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షను ఒకరికి బదులు ఇంకొకరు రాస్తూ 23 మంది పట్టుబడ్డారు. మరో నలుగురు అభ్యర్థులు మాస్‌ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. వీరిని స్క్వార్‌ పట్టుకున్నారు. ఈ వ్యవహారం ఇన్విజిలేటర్లకు తెలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 18న పరకాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పాఠశాలలో 14 మంది అభ్యర్థులు మాస్‌ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఈ అక్రమ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మాస్‌ కాపీయింగ్‌నుప్రోత్సహిస్తే చర్యలు తప్పవు
పరీక్షల్లో మాస్‌ కాపియింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాలకు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను సైతం ఏర్పాటు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం.
– నారాయణరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top