
నారాయణపేట కోర్టుకు కోబడ్‌గాంధీ
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డితోపాటు 10 మంది మృతి చెందిన కేసులో కోబడ్ గాంధీని ఢిల్లీ పోలీసులు మంగళవారం నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు.
మహబూబ్‌నగర్: మావోయిస్టుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డితోపాటు 10 మంది మృతి చెందిన కేసులో వ్యూహకర్తగా ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కోబడ్ గాంధీని ఢిల్లీ పోలీసులు మంగళవారం నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు.
2005 ఆగస్టులో ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో 8 మంది.. మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసుశాఖ 19 మందిపై కేసులు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా కోబడ్‌గాంధీని మొదటిసారి 2010, ఏప్రిల్ 27న జడ్జి ఎదుట హాజరుపరిచారు. అప్పటి నుంచి పీటీ వారెంట్ ఉండడంతో ఇంతవరకు కోర్టుకు హాజరుకాలేదని సమాచారం. అయితే మంగళవారం కోర్టుకు హాజరుపర్చాల్సి ఉండడంతో ఆయనను ఢిల్లీ పోలీసులు మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ప్రత్యేక బలగాల భద్రత మధ్య నారాయణపేట కోర్టుకు హాజరుపరిచారు. కేసును జడ్జి ఈనెల 21కి వాయిదా వేశారు. అనంతరం ఆయన్ను మళ్లీ ఢిల్లీలోని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. కాగా, ఆయనపై ఉన్న కేసును జిల్లా సెషన్ కోర్టుకు బదీలి చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.