
సాక్షి, హైదరాబాద్: జంపన్న లాగే మిగతా మావోయిస్టు నేతలు కూడా లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజితను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులతో సైద్ధాంతికంగా విభేదించి జంపన్న దంపతులు లొంగిపోయారని చెప్పారు.
జంపన్న అసలు పేరు జినుగు నరసింహారెడ్డి అని, మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం ఆయన స్వస్థలమని డీజీపీ వెల్లడించారు. 1984లో మల్లేపల్లిలో ఐటీఐ చదివేటప్పుడు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారని, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారని వివరించారు. జంపన్నపై 100 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలోనే 51 కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ మారడం లేదు కాబట్టి ఉద్యమం నుంచి జంపన్న బయటకు వచ్చారన్నారు.
జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇస్తేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు.
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు