ప్రతి 3 జబ్బుల్లో 2 జంతువుల నుంచే

Many Viruses Spread From Animals - Sakshi

స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, రేబిస్, నిఫా వైరస్‌ వంటివన్నీ వాటి నుంచే

అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

రేపు ‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం

ప్రాచీన కాలం నుంచి జంతువులతో మానవుని సహచర్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి మనిషి పశు పక్షాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాడు. అంతే కాదు.. పెంపుడు కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి ఉండదని పలువురు చెబుతుంటారు. ఈ సహచర్యంలో కొన్ని వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు తెలియకనే సంక్రమిస్తున్నాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ వైద్యం లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంక్రమిస్తున్న స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, రేబిస్, హెచ్‌ఐవీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) కూడా జంతువుల నుంచే మానవులకు సంక్రమించింది. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ జూనోసిస్‌ డే సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల(జూనోటిక్‌ వ్యాధులు)పై ప్రత్యేక కథనం.

సాక్షి, ఖమ్మం : జంతువుల నుంచి మనుషులకు, వారి నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ప్లూ వంటి వ్యాధులతో పాటు రేబిస్, టీబీ, జపనీస్‌ ఎన్‌సఫలైజేషన్‌ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమా దం ఉంది. కుక్కకాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా జపనీస్‌ ఎన్‌సఫలైజేషన్‌ (మొదడువాపు), పశువులు, గొర్రెలు వంటి ద్వారా టీబీ సోకుతున్నాయి. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధు లను జూనోటిక్‌ వ్యాధులు అంటారు. రేబిస్‌కు సంబంధించి వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు మినహా, వ్యాధి సోకిన తర్వాత వైద్యం లేదు. మూడేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రపదేశలో జబ్బు చేసిన మేకను తినడం వల్ల ఆంత్రాక్స్‌ ప్రబలిన విషయం తెలిసిందే. బర్డ్‌ఫ్లూ సైతం దేశంలో పలు ప్రాంతాల వ్యక్తులను వణికించిన విషయం కూడా తెలిసిందే. అడవి గబ్బిలం ద్వారా సోకే నిఫా వైరస్‌ కేరళలో 10 జూన్‌ 2018లో బయటపడి ఆ రాష్ట్రాన్ని వణికించింది.

బర్డ్‌ప్లూ వ్యాధి: 
బర్డ్‌ప్లూ లేదా ఇన్‌ప్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్‌ వల్ల కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉప రకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంక్రమిస్తు్తంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్ల కొలది కోళ్లు మరణించాయి. ప్రధానంగా వీటి పెంకందారులు, షెడ్లలో పనిచేసే వారికి త్వరితగతిన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా మందును ఇంతవరకు కనుగొన లేదు. టామిప్లూ వంటి వైరస్‌ నిరోధక మందులు వ్యాధి తీవ్రతను, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయి.

ఆంత్రాక్స్‌ వ్యాధి: 
 ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది.

బ్రూసెల్లోసిస్‌: 
ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్‌ బ్రూసెల్లా మెలిటెన్సిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా బ్యుటర్‌క్యులోసిస్‌ బ్యాక్టీరియా వల్ల క్షయ లేదా టీబీ, లెప్టాస్పైరా ఇక్టిరోహియో రేజికా బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్‌ వ్యాధులు వ్యాపిస్తాయి.

కుక్కకాటుకు గురైతే ఏం చేయాలి..
 కుక్కకాటుకు గురైనప్పుడు తక్షణమే ఆ గాయాన్ని సబ్బు నీటితో కానీ, మంచి నీటితో కానీ నిరంతరాయంగా పది నిమిషాల పాటు కడగాలి. కుక్క కరిచిన గాయానికి కట్టు కట్టడం, కుట్లు వేయడం, అయింట్‌మెంట్లు రాయడం కానీ చేయకూడదు. వీలైనంత త్వరగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. గాయాలు పెద్దవిగా ఉన్నా, తలకు దగ్గరకు కరిచినా ఏఆర్‌వీతో పాటు ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌ ఇంజెక్షన్లు తీసుకుంటే రేబిస్‌ సోకకుండా 95 శాతం రక్షణ ఉంటుంది. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా వేస్తున్నారు. కుక్క కరవడమే కాకుండా కాళ్లతో గీరినప్పుడు రక్తం వచ్చినా, శరీరంపై ఉన్న గాయాలపై కుక్క నాలుకతో నాకినా రేబిస్‌ వ్యాధి వచ్చే ఆవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే ఏఆర్‌వీ వేయించుకోవాలి. రేబిస్‌ సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి సోకే ఆవకాశం ఉంది.

రేబిస్‌ వ్యాధి.. 
రేబిస్‌ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ అన్ని కుక్కల వల్ల రేబిస్‌ వస్తుందనేది అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేబిస్‌ వ్యాధి రాబ్‌డో అనే వైరస్‌ వల్ల సోకుతుంది. ఈ వైరస్‌ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్‌ గాలి, నీటి ద్వారా మార్పు చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వల్ల వాటిలో ఉన్న వైరస్‌ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ ఉన్న కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. రేబిస్‌ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్‌ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన రేబిస్‌ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్‌ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. వ్యాధిని గుర్తించకపోవడంతో కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలి. 

జూనోటిక్‌ వ్యాధి కారకాలు 7 రకాలు
బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్‌  లెప్టోస్పైరోసిస్, క్షయ
∙ వైరస్‌: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్‌
∙ ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా,  లైష్‌మెనియాసిస్‌
∙ రెకెట్షియా: టిక్, టైఫస్, క్యూఫీవర్‌
∙ హెల్మెంథ్స్‌: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్‌
∙ ఎక్టోపారాసైట్స్‌: స్కేజిస్‌ పశువుల్లో రేబిస్‌ లక్షణాలు

రేబిస్‌ వ్యాధి సోకడం వల్ల పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం లాంటివి కనిపిస్తాయి. శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం. అరుపులు ఆవలింతలా వస్తాయి. నీటిని తీసుకోవు. పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11 రోజుల్లో జరిగిపోతాయి.

మనుషుల్లో.. జ్వరం రావడం, కాళ్లు పట్టుకుపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణిస్తారు. 
నివారణ చర్యలు..  ఈ వైరస్‌ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. కుక్కలతో తీసుకోల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించాలి. రేబిస్‌ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి.

జూనోసిస్‌ డే.. 
లూయిస్‌పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి నిరోధక టీకా ఇవ్వడం ద్వారా రేబిస్‌ వ్యాధి రాకుండా కాపాడగలిగాడు. దీంతో అప్పటి నుంచి ఏటా జూలై 6న జూనోసిస్‌ దినోత్సవంగా జరుపుతున్నాం. ఈ సందర్భంగా వ్యాధులు, సంక్రమణ విధానం, వాటి పట్ల అవగాహన కలిగించడంతో పాటు, నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top