
సాక్షి,మహబూబ్ నగర్: యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్ బోర్డుపై రాసింది.
నా భర్తను కాపాడండి.. రేబిస్ ఉంది. వ్యాక్సిన్‌కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండి
లక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్ ఉంది.
నా చివరి కోరి ధారూర్(వికారాబాద్)లో చెట్టు మందు తాగు.. లేట్ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది.
మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.
పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్ సోకిందని అనుమానం పెట్టుకుంది.
ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.