సక్కని సర్కారు బడి..

Many Problems In Govt Schools - Sakshi

అధునాతన సౌకర్యాలు.. 100% ఫలితాలు

ఇందిరానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 

సీటుకు యమా గిరాకీ

హెచ్‌ఎం, ఉపాధ్యాయుల సమష్టి కృషికి నిదర్శనం 

విద్య వికాసాన్ని నింపే ఆయుధం. విద్యార్థులు రేపటి దేశ ఆశా కిరణాలు.. విద్యాసంస్థలు రేపటి పౌరులను.. ఇంజనీర్లను.. డాక్టర్లను.. అన్నింటినీ కలిపి రేపటి దేశ సంపదను తయారు చేసే కర్మాగారాలు.. ప్రైవేటు పాఠశాల హోరుకు తట్టుకోలేక.. కనీస సదుపాయాలు లేక మూత బడిన పాఠశాలలెన్నో.. ఇదిలా ఉంటే సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ లాంటి విద్యాలయాలు ఫలితాలు, సదుపాయాలతో విద్యార్థులను క్యూ కట్టిస్తున్నాయమరో వైపు అందుబాటులో కళాశాల విద్య లేక అనేక ప్రాంతాల్లో విద్యార్థులు బస్సుల్లో గంటల తరబడి ప్రయాణించలేక పాట్లు పడుతున్నారు. నేడు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆదర్శంగా నిలుస్తున్న విద్యాలయాలు.. విద్యార్థుల సమస్యలు.. రాబోవు ప్రభుత్వంపై వారి ఆకాంక్షలపై ప్రత్యేక కథనం.. 

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ఆ పాఠశాలలో చదువుకునేందుకు అడ్మిషన్‌ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు క్యూ కడతారు. కాస్త ఆలస్యం అయిందా అంతే సంగతి.. ఇక సీటు గూర్చి మర్చిపోవాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలు సిఫార్సు చేసిన సీటు దొరకడం గగనమే. అంత క్రేజ్‌ ఉంది ఆ పాఠశాలకు. ఇదేదో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లేదా హైదరాబాద్‌లోని హెచ్‌పీఎస్‌ కాదు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

హెచ్‌ఎంగా రామస్వామి రాకతో మారిన రూపు..
జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ 2015 ముందు అన్ని పాఠశాల మాదిరిగానే సుమారు 400ల పైచిలుకు విద్యార్థులతో నడుస్తుండేది. 2015 జూలైలో ఈ పాఠశాలకు హెచ్‌ఎంగా రామస్వామి విధులు చేపట్టినప్పటి నుంచి ఉపాధ్యాయుల అందరి సహకారంతో క్రమంగా మంచి గుర్తింపును తీసుకువచ్చారు. ఇందుకోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అన్ని తరగతుల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థుల పూర్తి వివరాలను కంప్యూటరైజ్డ్‌  చేశారు.

దీంతో ఉపాధ్యాయులకు రాత పనిని పూర్తిగా తగ్గించి వారి సమయం మొత్తాన్ని విద్యార్థులపై కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశారు. మల్టీఫేస్‌డ్‌ విధానాన్ని అవలంబించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానం గూర్చి గతంలో బెంగుళూర్‌లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో హెచ్‌ఎం రామస్వామి వివరించి కేంద్రమంత్రితో ప్రశంసలు అందుకున్నాడు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారి తల్లిదండ్రులను కలవడం, అవసరమైన తల్లిదండ్రులకు నిపుణులచే కౌన్సిలింగ్‌లు నిర్వహించడం.

విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయితే వారి తల్లిదండ్రులకు మెసేజ్‌ పంపించేందుకు ప్రత్యేకంగా ఒక అప్లికేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం 828 మంది విద్యార్థులతో ప్రతి తరగతికి నాలుగు సెక్షన్లు ఏర్పాటు చేసి విద్యను బోధిస్తున్నారు. ప్రతి తరగతికి ఒక సీనియర్‌ ఉపాధ్యాయుడు ఇన్‌చార్జిగా విధులను నిర్వహిస్తూ ఆ తరగతికి సంబంధించిన పూర్తి అంశాలను చూస్తుంటాడు. ప్రతీ రోజు సాయంత్రం ఎక్స్‌ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌ నిర్వహణ, ప్రతిభావంతులన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుంటారు. ప్రతి వారాంతంలో విద్యార్థులచే ఒక్కో సబ్జెక్ట్‌ ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్‌ నిర్వహణ ఉంటుంది. 

సౌకర్యాలు..
నాట్కో ఫార్మ ఇండస్ట్రీ సహాయంతో ఒక కంప్యూటర్‌ ల్యాబ్, ఎటీఎల్‌ ల్యాబ్, అధునాతన మరుగుదొడ్లు, 6 అదనపు తరగతి గదులు నిర్మించారు. వీటితో పాటు కిచెన్‌కు, వాటర్‌ ప్లాంట్‌ కోసం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించారు. ప్రతీ తరగతి గదిలో అధునాతన బోర్డులు, డిజిటల్‌ క్లాస్‌రూం, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ తదితర సౌకర్యాలను కల్పించారు. వీటికి తోడు అధునాతన సైన్స్, కంప్యూటర్‌ ల్యాబ్‌లు వారంలోగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రకృతి ఒడి.. ఈ బడి
తొగుట(దుబ్బాక): చుట్టూ కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం... పచ్చని పంటలు, పాడిగేదెలతో కళకళాడుతున్న గ్రామం తోగుట మండలంలోని పెద్దమాసాన్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌. ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పచ్చదనానికి కేరాఫ్‌గా నిలుస్తోంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా 2009లో బాధ్యతలు స్వీకరించారు వైవి.సురేష్‌కుమార్‌. ఆయన రాకతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌లు, ష్యూస్‌ ఉచితంగా అందించారు. దాతల సహకారంతో విద్యార్థులకు ఏటా నోట్‌ పుస్తకాలు పంపిణీ చేపట్టారు.

పాఠశాలలో కేవలం 30 గుంటల భూమే ఉంది. ప్రహరీ సైతం లేకపోయినా సుమారు 300 మొక్కలు పెంచారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని స్పూర్తిగా తీసుకుని మొక్కలు పెంపకాన్ని చేపట్టారు. మామిడి, చింత, జామ, అల్లనేరేడు, పొప్పెడ, నిమ్మ, దానిమ్మ, పనస వంటి పండ్ల మొక్కలతో పాటు మునగ, ఎర్రచందనం, బాదాం, వేప, కొబ్బెర  వంటి మూడు వందల రకాల  మొక్కలు నాటారు.

వేసవిలో మొక్కలను కాపాడేందుకకు అటవిశాఖ అధికారుల సహకారంతో ట్యాంకర్‌ల ద్వారా నీరందించారు. తర్వాత విద్యార్థుల కోసం ప్రభుత్వం పాఠశాల ఆవరణలో బోరు వేయించింది. దీంతో మొక్కలను నీరు అందుతోంది. ఇంకా పాఠశాలలో పండించిన ఆకు కూరలు, కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయుడు సురేశ్‌ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి అవార్డు అందించి సత్కరించింది.

చిన్నారులకు నీళ్ల గోస
రాయికోడ్‌(అందోల్‌): మండలంలోని అనేక పాఠశాలలను తాగు నీటి సమస్య వెక్కిరిస్తోంది. మండలంలో మొత్తం 47 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 25 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 30 పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత దశాబ్దకాలంగా పాఠశాలల్లో తాగునీటి ఇబ్బందుల నడుమే విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. మండల కేంద్రం రాయికోడ్‌లోనూ పాఠశాలల విద్యార్థులు నీటి సమస్యతో తీవ్ర తిప్పలు పడుతుండడం గమనార్హం.

ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి సంవత్సరం పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను ఉన్నతాధికారులకు నివేధిస్తున్నామని చెబుతున్నా విద్యాశాఖ నుంచి మాత్రం పరిష్కారం లభించడం లేదు. నిత్యం విద్యార్థులు ఇంటి నుంచి తాగునీటి తెచ్చుకుని మధ్యాహ్న భోజనం సమయంలో వినియోగించుకుంటున్నారు. ప్రచారానికి వచ్చే నాయకులు తమ పిల్లల ఇబ్బందులు చూసి పరిష్కారానికి హామీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

రోడ్డు పక్కన.. ఉన్న పాఠశాల దుస్థితి
రేగోడ్‌(మెదక్‌): మండలంలోని వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రోడ్డు పక్కనే ఉంది. దీనికి ప్రహరీ గోడ కూడా లేదు. విద్యార్థులు బడి నుంచి బయటకు రావడంతోనే రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. పాఠశాలకు కనీసం ప్రహరీని నిర్మించాలని పదేపదే కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆదర్శ బడికి అవస్థల ప్రయాణం
మద్దూరు(హుస్నాబాద్‌): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు మండలంలోని 23గ్రామాల నుండి విద్యార్థులు వస్తారు. మండలం లోని సగం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక వారంతో ఆటోల్లోనే ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సిన దుస్థితి. అధికారులు, ప్ర భుత్వ పెద్దలు స్పందించి కనీసం పాఠశాల సమయాల్లోనైనా బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

నిత్యం బస్సు బాధే
నారాయణఖేడ్‌: చదువు కోసం ఖేడ్‌కు నిత్యం వచ్చే విద్యార్థులు బస్సుల కోసం పడుతున్న ఇబ్బందులు కోకొల్లలు. ఎన్నిమార్లు డీఎం, ఆర్‌ఎం, రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం ఉండడంలేదు. ఆందోళన చేసిన సందర్భంలో ఒకటి, రెండు రోజులు బస్సుసర్వీసు నడపడం, అనంతరం పరిస్థితి మొదటికే రావడం ఇక్కడ మామూలుగానే మారింది. విద్యార్థులకు బస్‌పాసులు ఉండడంతో తమకు ఆదాయం సమకూరదన్న భావనతో బస్సులను స్టేజీల వద్ద నిలపకపోవడం, పాఠశాలల సమయాలకు అధికారులు బస్సులు నడపడం లేదు.

నారాయణఖేడ్‌ నుంచి రాయిపల్లి, అంత్వార్, రుద్రార్, పుల్‌కుర్తి, మనూరు, బెల్లాపూర్, కారాముంగి, కరస్‌గుత్తి, నాగల్‌గిద్ద, మోర్గి, తుర్కాపల్లి, ర్యాకల్, గంగాపూర్, సిర్గాపూర్, నల్లవాగు, బీబీపేట్, కల్హేర్, మాసాన్‌పల్లి, బాచేపల్లి, నిజాంపేట్, సంజీవన్‌రావుపేట్, హన్మంత్‌రావుపేట్, లింగాపూర్‌ తదితర రూట్లనుండి వచ్చే విద్యార్థులు నిత్యం పాట్లు పడక తప్పడంలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top