పెట్టుబడులతో మరిన్ని కంపెనీలొస్తున్నాయి

Many Companies Interested To Invest In Telangana Says KTR - Sakshi

ఐటీ, పరిశ్రమల శాఖ కార్యక్రమాలపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌

అవసరమైన మౌలిక వసతులు, ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో త్వరలో పెట్టుబడులు

జూలైలో అతిపెద్ద ప్రోటోటైపింగ్‌ సెంటర్‌ ‘టీ వర్క్స్‌’ ప్రారంభం
 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల అవసరాల కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల పురోగతి, భూ సేకరణ తదితర అంశాలపైనా సమీక్ష నిర్వహించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు ఆసక్తి
బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి నివేదించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఇప్పటికే హట్సన్‌ అగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ రూ.207 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంటును నిర్మిస్తోందన్నారు. వంద మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్లాంటు ద్వారా సుమారు 4 వేల మంది పాడి రైతులకు మేలు కలగడంతో పాటు, ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని మంత్రి కేటీఆర్‌ వివరిస్తూ.. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. టెక్స్‌టైల్‌ పార్కులో అవసరమైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.

త్వరలో ‘టీ హబ్‌’ రెండో దశ పూర్తి
వివిధ రంగాల్లో స్టార్టప్‌ల ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ‘టీ హబ్‌’ రెండోదశ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రెండో దశ ప్రారంభం తర్వాత టీ హబ్‌ దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్‌గా అవతరిస్తుందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది జూలైలో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్‌ సెంటర్‌ ‘టీ వర్క్స్‌’ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలను నగరం నలుమూలలా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరమైన పార్కుల అభివృద్ది, కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఐటీ టవర్లలో తమ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. కరీంనగర్‌లో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం పట్టణాల్లోనూ ఐటీ టవర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ద్వితీయశ్రేణి నగరాల్లోని ఐటీ టవర్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కంపెనీలతో సంప్రదింపులు జరపాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్కరాజకణ్ణన్, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top