breaking news
IT hardware sector
-
ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐకి 40 దరఖాస్తులు - లక్షల కోట్ల ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్ ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 4.65 లక్షల కోట్ల విలువ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు మొదలైనవి తయారు చేసేందుకు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అవన్నీ ఎంపికైన పక్షంలో ప్రోత్సాహక మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించిన రూ. 17,000 కోట్లకు మించి రూ. 22,890 కోట్లకు పెంచాల్సి వస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ‘గడువు తేదీ ఆగస్టు 30 నాటికి 40 దరఖాస్తులు వచ్చాయి. రూ. 3.35 లక్షల కోట్ల తయారీ లక్ష్యాలకు మించి రూ. 4.65 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేశాయి‘ అని పేర్కొంది. డెల్, హెచ్‌పీ వంటి బడా ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు నేరుగా, హెచ్‌పీఈ, లెనొవొ, ఏసర్, అసూస్, థామ్సన్ వంటివి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్లు ఉన్న కంపెనీల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా వాటిల్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్, ప్యాడ్జెట్ (డిక్సన్), వీవీడీఎన్, నెట్వెబ్, ఆప్టీమస్, సహస్ర, సోజో (లావా) మొదలైనవి ఉన్నాయి. -
పెట్టుబడులతో మరిన్ని కంపెనీలొస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల అవసరాల కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల పురోగతి, భూ సేకరణ తదితర అంశాలపైనా సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు ఆసక్తి బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్ ఫుడ్‌పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి నివేదించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇప్పటికే హట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ రూ.207 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంటును నిర్మిస్తోందన్నారు. వంద మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్లాంటు ద్వారా సుమారు 4 వేల మంది పాడి రైతులకు మేలు కలగడంతో పాటు, ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. టెక్స్టైల్ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని మంత్రి కేటీఆర్ వివరిస్తూ.. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో అవసరమైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. త్వరలో ‘టీ హబ్’ రెండో దశ పూర్తి వివిధ రంగాల్లో స్టార్టప్‌ల ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ‘టీ హబ్’ రెండోదశ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశ ప్రారంభం తర్వాత టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్‌గా అవతరిస్తుందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది జూలైలో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలను నగరం నలుమూలలా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరమైన పార్కుల అభివృద్ది, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఐటీ టవర్లలో తమ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం పట్టణాల్లోనూ ఐటీ టవర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ద్వితీయశ్రేణి నగరాల్లోని ఐటీ టవర్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కంపెనీలతో సంప్రదింపులు జరపాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజకణ్ణన్, టెక్స్టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఐటీ హార్డ్ వేర్ తో 4 లక్షల ఉద్యోగాలు..!
ప్రభుత్వం పన్ను సుంకాలను తగ్గించాలి: ఎంఏఐటీ న్యూఢిల్లీ: దేశీ ఐటీ హార్డ్‌వేర్ రంగం ఉపాధి కొలువుగా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో నోట్‌బుక్, డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు సహా తదితర వస్తువుల తయారీకి చేయూతనందించేలా పన్ను సుంకాలను తగ్గిస్తే.. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య ‘మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎంఏఐటీ) తన నివేదికలో పేర్కొంది. ఎంఏఐటీలో చిప్ తయారీ సంస్థ ఇంటెల్, పీసీ తయారీ కంపెనీ లెనొవొ, ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ వంటి తదితర కంపెనీలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల ఉద్యోగాల్లో.. లక్ష ఉద్యోగాలు ప్రత్యక్ష ఉపాధికి సంబంధించినవి అయితే మిగిలిన 3 లక్షల ఉద్యోగాలు విడిభాగాల తయారీకి చెందినవని ఎంఏఐటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్వర్ శిర్పూర్వాలా తెలిపారు. పాలసీ సంస్కరణలు సహా మార్కెట్ సంబంధిత అడ్డంకులను తొలగిస్తే ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఏడాది కాలంలో రెట్టింపు వృద్ధితో 2.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు.