గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్‌

Mango Market Sheds Collapsed At Rangareddy District - Sakshi

ఒక షెడ్డు ధ్వంసం.. మరో మూడు షెడ్లపై కొట్టుకుపోయిన రేకులు

30 మందికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఘటన

వెయ్యి టన్నుల మామిడి దెబ్బతిన్నట్లు అంచనా

కోహెడ/హయత్‌నగర్‌: గాలివాన బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్‌ షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ మామిడి ప్యాక్‌ చేస్తున్న సుమారు 30 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చిన గాలివానకు అవి తట్టుకోలేకపోయాయి.

ఒక్క షెడ్డు పూర్తిగా కూలిపోగా, మిగిలిన 3 షెడ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 1000 టన్నుల మామిడి మార్కెట్‌లో ఉంది. దీని విలువ రూ.1.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలి పాయి. కాయలన్నీ దెబ్బతిన్నాయని రైతులు, వ్యాపారులు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి వచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇద్దరికి తీవ్ర గాయాలు : షెడ్డు కూలిన ఘటనలో తొర్రూర్‌కు చెందిన తిమ్మమ్మ, నాగోల్‌ జైపురి కాలనీకి చెందిన అన్వేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మల్లేష్, శ్రీహరి, రేణుక, లక్ష్మి, తిరుపతమ్మ, అనిల్‌కుమార్, సలీం షేక్, హజీ పాషా, గౌస్‌ పాషా, నర్సింహ్మా, మల్లమ్మ, హనుమంతు, శివ, ఆంజనేయులు, యాదగిరి, యాద య్య, మమత, లక్ష్మి, సునీత, హైమవతి, షేక్‌ దస్తగిరి, అంజమ్మ, నీలా, సత్తయ్య, యాద య్య, నర్సమ్మ, బుజ్జ మ్మ, జుబేర్‌ ఖాన్‌ ఉన్నారు. వీరిలో కొందరు కోహెడకు మరికొందరు సింగరేణి కాలనీకి చెందినవారు. ప్రస్తుతం వీరు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. కమీషన్‌లకు ఆశపడి నాణ్యత లేని షెడ్లను నిర్మించారని ఆరోపించారు. 

చికిత్స పొందుతున్న బాలిక

నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు
మూడు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ ఇంటీరియర్‌ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top