మాధవితో మాట్లాడాను : మందకృష్ణ

Manda Krishna Madiga Meets Madhavi In Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తండ్రిలో చేతిలో పాశవికంగా దాడికి గురైన మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవిని గురువారం కలిశానని ఆయన తెలిపారు. మాధవితో మాట్లాడానని, ప్రస్తుతం ఆమె చాలా ధైర్యంగా ఉందని.. తల్లి, తమ్ముడిని చూడాలని ఉందంటూ అడిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవికి వైద్యం అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

రక్షణ కల్పించడంలో విఫలం...
మిర్యాలగూడ ప్రణయ్‌ హత్యపై దేశం మొత్తం స్పందించింది.. కానీ కేసీఆర్‌ మాత్రం స్పందించలేదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణయ్‌, మాధవిల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇటువంటి ఘటనలపై స్పందించకపోతే శాంతి భద్రతలు ఎక్కడికి పోతాయంటూ ప్రశ్నించారు. 24 గంటల్లో ఈ ఘటనలపై కేసీఆర్‌ తన వైఖరి తెలపకపోతే.. 48 గంటల్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్‌ చేశారు.

పోలీసులు ఎవరివైపు?
మాధవిపై అత్యంత పాశవికంగా దాడి జరిగితే.. మనోహరాచారి మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ ఎలా చెబుతారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ చూస్తుంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందంటూ ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top