కిడ్నీ.. కిలాడీలు!

Man Cheated A father To Give Kidney In Nalgonda - Sakshi

కిడ్నీ ఇప్పిస్తామని ఓ బాధితుడి నుంచి డబ్బులు వసూలు

నెలల తరబడి తిప్పించుకున్న దళారులు

సాక్షి, నల్లగొండ : కిడ్నీ సమస్యతో చావుకు దగ్గరైన కన్న కూతురును దక్కించుకునేందుకు ఓ తండ్రి కిడ్నీ మాయగాళ్ల వలలో చిక్కాడు. తన పేరు బయటకు రావడం ఇష్టం లేని నల్లగొండ మండలానికి చెందిన ఆ బాధితుడి కన్నీళ్లను జిల్లా పోలీసులు తుడిచారు. నమ్మించి మోసం చేసిన వారినుంచి మొత్తం డబ్బులు రికవరీ చేసి.. బాధితుడికి రూ.10.17 లక్షలు అప్పజెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే, ఆరోగ్య అత్యవసరాలను కొందరు దళారులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో ఈ కేసును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఏం... జరిగిందంటే..
నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కిడ్నీ సమస్యతో చనిపోయింది. కొన్నాళ్లకు రెండో కూతురుకూ అదే సమస్య వచ్చింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కిడ్నీ మార్పిడి మినహా మరో మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ సమస్యనుంచి ఎలా బయట పడాలో తెలియక కన్నీళ్లతో ఆస్పత్రి వెలుపల కూర్చున్న బాధితుడిని.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని, కిడ్నీలు ఇప్పిస్తారని చెప్పి.. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడించింది. ఆ తర్వాత నేరుగా సదరు దళారులు.. బాధితుడి గ్రామానికి వచ్చి ఒక కిడ్నీకి రూ.16.50లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్‌గా తీసుకువెళ్లారు.

అది మొదలు వరుసబెట్టి నెల రోజుల్లోనే రూ.8.70లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కూడా పరీక్షలు, ఇతరత్రా పేర మొత్తంగా రూ.10.17లక్షలు వసూలు చేసుకున్నారు. తీరా కిడ్నీ ఎక్కడ అని అడిగేసరికి మొఖం చాటేశారు. ఫోన్‌ చేసిన ప్రతిసారీ ఇదిగో అదిగో అంటూ దాటవేసిన వారు చివరికి బెదిరింపులకూ దిగారు. ఉన్న ఎకరం పొలం అమ్మగా వచ్చిన సొమ్మును మాయగాళ్ల చేతిలో పోసిన బాధితుడు రోజురోజుకూ క్షీణిస్తున్న తన కూతురు ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేని నిస్సాహాయ స్థితిలో లబోదిబోమంటూ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను కలిశాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. 

తీగలాగిన పోలీసులు
జరిగిన మోసాన్ని నిగ్గుతేల్చాలని ఎస్పీ .. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను పురమాయించారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, ముస్తాబాద్‌కు చెందిన శ్రీనివాస్, లింబరాజు అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించి జిల్లాకు పట్టుకొచ్చారు. పోలీసుల విచారణలో వీరు తాము చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. బాధితుడినుంచి వసూలు చేసుకున్న సొమ్మునంతా రికవరీ చేసిన పోలీసులు వారిపై నల్లగొండ రూరల్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో సదరు మధ్యవర్తులు గతంలో కరీంనగర్, వరంగల్‌ తదితర జిల్లాలో కూడా మోసాలకు పాల్పడినట్లు ‘ఇంటరాగేషన్‌ ’లో తెలుసుకుని ఆ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాధితుడికి సొమ్ములు అందడంతోపాటు.. నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. 
దళారుల తరఫున 

ఓ జెడ్పీటీసీ సభ్యుడి వకాల్తా!
ఈ మొత్తం ఉదంతంలో ఆసక్తికరమైన మరో చిన్న సంఘటన కూడా జరిగింది. కిడ్నీ దళారులు శ్రీనివాస్, లింబరాజులను పోలీసులు అరెస్టు చేసి రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశాక.. వసూలు చేసిన సొమ్ములు రికవరీ చేసి బాధితుడికి అప్పజెప్పే సమయంలో పంచాయితీ పేర ఓ జెడ్పీటీసీ సభ్యుడు నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నాడు. ఆయనకు అదే స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ బాసటగా నిలిచాడు. కేసు ఎందుకు పెట్టారని బాధితుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమొత్తం మాత్రమే డబ్బులు ఇస్తారు.. పూర్తిగా ఇవ్వరంటూ బెదిరింపులకూ పాల్పడ్డాడు. అయితే, ఎస్పీ ఈ కేసును నేరుగా పర్యవేక్షించడంతో సదరు జెడ్పీటీసీ సభ్యుడి, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ పప్పులు ఉడకలేదు.

మాయమాటలు నమ్మి మోసపోవద్దు
మాయ మాటలతో బురిడీ కొట్టించే వారు ప్రతిచోటా ఉంటారు. కన్న కూతురుకు కిడ్నీ ఆపరేషన్‌ చేయించడం కోసం ఉన్న పొలం అమ్మి సొమ్ములు పోగొట్టుకున్న వ్యక్తి కలిసి వివరాలు చెప్పడంతో నిందితులను ట్రేస్‌ చేసి అరెస్టు చేసి తీసుకువచ్చాం. బాధితుడికి డబ్బులన్నీ తిరిగి ఇప్పించడమే కాకుండా, నిందితులపై కేసు నమోదు చేశాం. వివిధ రకాలుగా మోసపోయిన వారెవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇస్తే నిందితులను కచ్చితంగా పట్టుకుని న్యాయం జరిగేలా చూస్తాం.  
 ఏవీ రంగనాథ్, ఎస్పీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top