మైసమ్మగూడను స్మార్ట్‌గా చేస్తా | maisammaguda promises for smart city of maisammaguda | Sakshi
Sakshi News home page

మైసమ్మగూడను స్మార్ట్‌గా చేస్తా

Jan 26 2015 2:01 PM | Updated on Mar 28 2018 11:11 AM

తాగునీటి ఎద్దడి, సక్రమంగా లేని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, సమస్యలకు చిరునామాగా మారింది మేడ్చల్ మండలంలోని మైసమ్మగూడ గ్రామం.

గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న ఎంపీ మల్లారెడ్డి
 
 తాగునీటి ఎద్దడి, సక్రమంగా లేని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, సమస్యలకు చిరునామాగా మారింది మేడ్చల్ మండలంలోని మైసమ్మగూడ గ్రామం. నగరానికి కేవలం 20 కి.మీ. దూరంలోనే ఉన్న ఈ గ్రామం విద్యాసంస్థలతో విరాజిల్లుతున్నా.. మౌలిక సదుపాయాలు మాత్రం నామమాత్రంగా మారాయి. మైసమ్మగూడ వాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మైసమ్మగూడలో పర్యటించారు. టీ స్టాళ్ల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతులతో మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, మైసమ్మగూడను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
 
 ఎంపీ: ఏం తల్లీ.. పింఛన్ వస్తోందా?
 నర్సమ్మ: వస్తోంది సారూ.. మొన్న మూడు నెలల పింఛన్లు ఇచ్చిన్రు.
 ఎంపీ:  మీ సమస్యలన్నీ తెలుసుకుని, పరిష్కరించడానికే వచ్చాను. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి.
 ఎంపీ:  పెద్దవ్మూ.. రేషన్ వస్తోందా?
 లక్ష్మమ్మ: ఈ నెల రేషన్ వచ్చింది సారు. కార్డులే రాలే.
 ఎంపీ: ప్రభుత్వం త్వరలోనే ఇస్తుంది. గరీబోలందరికీ బియ్యం వస్తాయి. ప్రతి ఒక్కరికీ ఆరు కిలోలు వస్తయ్. ఎవరికైనా రాకుంటే  అధికారులకు చెప్పి ఇప్పిస్తా.
 లక్ష్మమ్మ: మంచిది సారు.
 ఎంపీ: బిడ్డా ఏం పని చేస్తున్నరు?
 భవాని: వెల్డింగ్ పని చేస్తున్నాం.
 ఎంపీ: ఎవరెవరు చేస్తున్నరు. ఎంతమంది చేస్తున్నారు.
 భవాని: నేను మా ఇద్దరు చెల్లెళ్లు ఈ పని చేస్తున్నం.
 ఎంపీ: ఇంకా ఎవరైనా తోడుగా ఉన్నారా?
 భవాని:  మా నాన్నతో కలిసి ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఈ పని చేసుకుంటున్నం.
 ఎంపీ: ఎంత వరకు సంపాదిస్తున్నారు?
 భవాని: మా కుటుంబం గడుస్తోంది సారు.
 ఎంపీ: మీరు ఎంత వరకు చదువుకున్నారు?


 భవాని:  అంతంత మాత్రమే చదువుకున్నాం.
 ఎంపీ: మీరు చదువుకుంటానంటే నేను నా సొంత ఖర్చులతో చదివిస్తా.
 రాధ: మీరు సాయుం చేస్తానంటే పెద్ద చదువులు చదువుకుంటాం.
 ఎంపీ: మీకు చదువుపై ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు నా కాలేజీలోనే ఉచితంగా చదివిస్తా.
 ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
 శ్రీలత: మా వెల్డింగ్ దుకాణం చిన్నగా ఉంది. మాకు గ్రామంలో ఆర్డర్లు దొరకడం లేదు సారు.
 ఎంపీ: మీరు కష్టపడి పనిచేస్తే వూ కళాశాలకు అవసరమైన ప్రతి ఫ్యాబ్రికేషన్ పనులను మీకే అప్పగిస్తా.
 ఎంపీ: ఏం పెంటయ్య బాగున్నావా... గ్రామంలో ఏమైనా సమస్యలున్నాయా?
 పెంటయ్య: మా గ్రామంలో కొంతమందికి రేషన్ కార్డుల లిస్టులో పేర్లు రాలేదు సార్.
 ఎంపీ: గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వారికి, దనవంతులకు రేషన్ కార్డులు రావు. అర్హతలున్నవారికి రేషన్ కార్డులు రాకపోతే దగ్గరుండి ఇప్పిస్తా.


 ఎంపీ: ఏం బాబు పింఛన్ వస్తుందా ?
 పరమేష్ (వికలాంగుడు): సార్.. పింఛన్ రావడం లేదు. మీరే ఇప్పించాలి.
 ఎంపీ: సదరమ్ సర్టిఫికెట్ ఉంటే అధికారులతో మాట్లాడి పింఛన్ అందేలా చేస్తా.
 ఎంపీ: ఏం పెద్ద మనిషి బాగున్నావా.. నీళ్లు సరిగా వస్తున్నాయా?
 రాంరెడ్డి: నీళ్ల ఇబ్బంది బాగా ఉంది సార్.
 ఎంపీ: అక్కడే ఉన్న సర్పంచ్ ఈశ్వర్‌ని పిలిచి గ్రామంలో నీటి సమస్య లేకుండా చూడండి. నిధులు లేకపోతే నా నిధుల నుంచి  కేటాయిస్తాను.


 ఎంపీ: ఏమమ్మా కరెంట్ సరిగ్గా ఉంటోందా..  వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇస్తున్నారా?
 యశోద: ఇప్పటికైతే మంచిగానే ఉంది సార్.
 ఎంపీ: ఏమయ్యూ.. పాల వ్యాపారం ఎట్లా నడుస్తోంది.. గిట్టుబాటు ధర వస్తోందా?
 మహంకాళి: ఫరవాలేదు సార్. లీటరుకు రూ.40 వస్తున్నాయ్. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో మేతకే ఇబ్బందిగా ఉంది.
 ఎంపీ: ఏం తమ్ముడు.. నీ బిడ్డకు టీకాలు ఇప్పించావా.. ఏఎన్‌ఎంలు గ్రామానికి వస్తున్నారా?
 మారుతిరెడ్డి: ఇప్పించాను సార్. నేనే దవాఖానకు తీసుకెళ్లి ఇప్పించా. ఏఎన్‌ఎంలు మా వైపు ఎప్పుడూ రాలేదు.


 ఎంపీ: ఏ తల్లీ.. ఏం చదువుతున్నావ్?
 పావని: బీటెక్ చదవుతున్నాను సర్.
 ఎంపీ: కాలేజీకి వెళ్లలేదా.. ఇక్కడేం చేస్తున్నావ్?
 పావని: కాలేజీలో ప్రాక్టికల్స్ నడుస్తున్నాయ్.. బస్సు కోసం నిలబడ్డాను సర్.
 ఎంపీ: కాలేజీలో.. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారా?
 కళ్యాణి: అలాంటిది ఏం లేదు సర్. పోలీసులు, కళాశాల సెక్యూరిటీ సిబ్బంది భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.   


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement