ఓటు @ రూ.10 వేలు!

Main parties focus on postal ballot votes - Sakshi

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ప్రధాన పార్టీల దృష్టి

ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలను రంగంలోకి దింపిన అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఓ పోస్టల్‌ బ్యాలెట్‌ అక్షరాలా రూ.10 వేలకు అమ్ముడుపోతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోస్టల్‌ఓట్లపై గురిపెట్టారు. కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను అభ్యర్థులు రంగంలో దింపి దొరికిన కాడికి గుంపగుత్తగా పోస్టల్‌ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము కోరిన అభ్యర్థికి పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటేసి చూపిస్తే ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. డబ్బు, ఖరీదైన బ్రాండ్ల మద్యం ఆఫర్‌ చేస్తున్నారు.  

విధుల్లో ఉద్యోగులు, పోలీసులు.. 
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 37,556 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్‌ అధికారులు మొత్తం కలిపి 1,50,023 మం ది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల రోజు బందోబస్తు, భద్రత పర్యవేక్షణలో పాల్గొనే రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను కలుపుకుని మొత్తం సుమారు 2 లక్షల మంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు.

పోలింగ్‌ రోజు స్వస్థలాల్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు లేకపోవడంతో ఎన్నికల సంఘం వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లను ఎన్నికల సంఘం సరఫరా చేసింది. ఈ నెల 7న రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, 11న ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుకు 24 గంటల ముందు వరకు సంబంధిత నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెల్లో పోస్టల్‌ బ్యాలెట్లను వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గతంలో కొందరు అభ్యర్థులు కేవలం పోస్టల్‌ ఓట్ల మెజారిటీలో గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏర్పడితే గట్టెక్కేందుకు పోస్టల్‌ ఓట్ల సహాయపడవచ్చని భావించి అభ్యర్థులు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top