'కొత్త సీఎం ఎవరని ఏపీ మంత్రులు చర్చిస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'కొత్త సీఎం ఎవరని ఏపీ మంత్రులు చర్చిస్తున్నారు'

Published Wed, Jun 17 2015 7:18 PM

'కొత్త సీఎం ఎవరని ఏపీ మంత్రులు చర్చిస్తున్నారు' - Sakshi

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ఖాయమని తేలిపోవడంతో, ఆ రాష్ట్ర మంత్రులంతా తమ నూతన సీఎం ఎవరా అని చర్చించుకుంటున్నారని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని, ఆయన తప్పు చేశాడని ప్రజలు, కేంద్రం కూడా నమ్మటం వల్ల బాబు భయపడుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులోని అసలు విషయాలు దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ, ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఏపీ పోలీసులకు హైదరాబాద్‌లో ఏం పని..? తెలంగాణలో ఏపీ పోలీసు స్టేషన్లు పెడుతుంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు..’అని మంత్రి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించి బాబు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు వ్యవహారంపై కేంద్రం కూడా చేతులు ఎత్తేసిందని, ఇక లాభం లేదని సెక్షన్-8 ను పదే పదే తెరపైకి తెచ్చి తప్పించుకునేందుకు కొత్త దారులు వెదుకుతున్నాడని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని, తెలంగాణలో శాంతి భద్రతలపై ఏపీ పోలీసులకు అవగాహన లేదని మంత్రి మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement