breaking news
Mahendarreddy
-
'కొత్త సీఎం ఎవరని ఏపీ మంత్రులు చర్చిస్తున్నారు'
హైదరాబాద్ : 'ఓటుకు నోటు' కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ఖాయమని తేలిపోవడంతో, ఆ రాష్ట్ర మంత్రులంతా తమ నూతన సీఎం ఎవరా అని చర్చించుకుంటున్నారని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని, ఆయన తప్పు చేశాడని ప్రజలు, కేంద్రం కూడా నమ్మటం వల్ల బాబు భయపడుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులోని అసలు విషయాలు దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ, ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఏపీ పోలీసులకు హైదరాబాద్‌లో ఏం పని..? తెలంగాణలో ఏపీ పోలీసు స్టేషన్లు పెడుతుంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు..’అని మంత్రి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించి బాబు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు వ్యవహారంపై కేంద్రం కూడా చేతులు ఎత్తేసిందని, ఇక లాభం లేదని సెక్షన్-8 ను పదే పదే తెరపైకి తెచ్చి తప్పించుకునేందుకు కొత్త దారులు వెదుకుతున్నాడని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని, తెలంగాణలో శాంతి భద్రతలపై ఏపీ పోలీసులకు అవగాహన లేదని మంత్రి మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
తెలుగు తమ్ముళ్లకు వాస్తు భయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగు తమ్ముళ్లకు వాస్తుభయం పట్టుకుంది. ఒక్కరొక్కరే సైకిల్ దిగి కారెక్కుతుండటంతో డీలాపడిన ముఖ్యనేతలు దీనికి వాస్తు దోషమే కారణమనే నిర్ణయానికొచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకులందరూ పార్టీని వీడడానికి ఆఫీసుకు వాస్తు లేకపోవడమేనని అంచనాకొచ్చారు. నాడు మహేందర్‌రెడ్డి పార్టీ వీడినా.. తాజాగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరినా.. వాస్తుదోషమేనని అనుమానిస్తున్నారు. తాజాగా సారథ్య బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌గౌడ్ ఇదే అపనమ్మకంతో పార్టీ కార్యాలయం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. గతంలో మహేందర్‌రెడ్డి కారెక్కిన సమయంలో వాస్తుగండమేనని భావించిన మంచిరెడ్డి పార్టీ కార్యాల యాన్ని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి మార్చారు. ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన ప్రకాశ్‌గౌడ్.. ఈ ఆఫీసును మార్చేందుకు వాస్తు నిపుణులను సంప్రదిస్తున్నారు.