ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

Lovers married With parents Acceptance In Manakondur - Sakshi

సాక్షి, మానకొండూర్‌( కరీంనగర్‌) : వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లో పెళ్లి తంతు పూర్తయ్యేలోగా ప్రియుడి తరఫు వారు అడ్డుకోవడంతో కథ మలుపు తిరిగింది. ఈక్రమంలో ప్రియుడు పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఇంటి నుంచి కనబడకుండా వెళ్లిపోగా, ఆ యువతి రెండునెలల పాటు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందె. చివరికి గ్రామ పెద్దలు రాజీకుదుర్చడంతో మూడున్నర నెలలు ఉత్కంఠతకు తెరపడింది. పెళ్లి ఆగిన చోటనే ప్రేమికులు గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం ఒక్కటయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెల్ధి గ్రామానికి చెందిన అంతగిరి నందిని, అదే గ్రామానికి చెందిన ఎనగంటి శ్రీధర్‌ ప్రేమించుకున్నారు.

గత మార్చిలో తిమ్మాపూర్‌ మండలంలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ లోపే అబ్బాయి తల్లీదండ్రులు ఆలయానికి వచ్చి శ్రీధర్‌ను తీసుకెళ్లారు. మరుసటి రోజు అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అప్పటి సీఐ ఇంద్రసేనారెడ్డి ఇరుకుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించిన మరుసటి రోజునుంచే శ్రీధర్‌ కనిపించకుండా పోయాడు. ప్రియుడు ఇంటి ఎదుట యువతి 59 రోజుల పాటు ధర్నా చేసింది. గ్రామస్తులు, కులసంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. ప్రియుడు, అతడి తల్లీదండ్రులు మాత్రం ఇంటికి రాలేదు. పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గ్రామంలో పెద్దలు ఇరుకుటుంబాలతో సంప్రదింపులు జరిపారు. చివరికి శ్రీధర్‌ పెళ్లికి ఒప్పుకున్నాడు. బుధవారం గ్రామస్తులు సమక్షంలో తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమయింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top