ఒకే ఒక్కటి

Lok Sabha Elections 2019 Congress Online Applications NIzamabad - Sakshi

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌కు దరఖాస్తులు కరువు 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్దమవుతోంది. టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం ప్రారంభించింది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం టికెట్‌ కోసం నేతల్లో స్పందన కరువైంది. కేవలం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అది కూడా ఓ సామాన్య కార్యకర్త మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితి ఆ పార్టీలో నిస్తేజానికి నిదర్శమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో ఘెర పరాజయం పాలైంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది.

రాష్ట్రంలోనూ చతికిల పడటంతో ఆ పార్టీ శ్రేణులతో నిస్తేజం ఆవహించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి ముఖ్య నేతలెవరూ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరించగా, ఒక్కో స్థానానికి 20 నుంచి 30 మంది వరకు నేతలు దర ఖాస్తు లు చేసుకున్నారు. 17 స్థానాలకు ఏకంగా 380 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్‌ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో నెలకొన్న ఈ పరిస్థితులు నిస్తేజం కాదని, వ్యూహాత్మకమని హస్తం నేతలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుత నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా కల్వకుంట కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలకు అందనంత స్థాయిలో వ్యూహాన్ని అమలు చేసి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇదే మాదిరిగా పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌వి ఏవైనా కీలక నిర్ణయాలుండే అవకాశాలుండటంతో అందుకు అనుగుణంగానే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఒకరిద్దరు కాంగ్రెస్‌ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు.

కేవలం ఒకే దరఖాస్తు వచ్చిందని బయటకు చెబుతున్నప్పటికీ, పోటీకి ముగ్గురు నలుగురు గట్టి నేతలు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు వినిపించగా, తాజాగా జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కూడా తాను పోటీకి సిద్ధమని టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ మధుయాష్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందిన ఆయన, 2014 ఎన్నికల్లో పరాజయం పాలుకాగా, ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇతర ముఖ్యనేతల నుంచి దరఖాస్తులు రాలేదని చెప్పుకొస్తున్నారు.

25 తర్వాత స్పష్టత వచ్చేఅవకాశాలు.. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈనెల 15న హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనాయకత్వం సమీక్ష జరిపింది. ఈసారి కూడా మధుయాష్కి పోటీ చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటన ఆలస్యం చేయవద్దనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న ఐదుగురు నేతల జాబితాను ఈనెల 25లోపు పంపాలని, జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి రాష్ట్ర నాయకత్వం సూచించింది. డీసీసీ పంపనున్న జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే అంశం ఈనెల 25 తర్వాత తేలనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top