మద్యం..మంట

Loackdown Alcohol Sales in Rangareddy - Sakshi

ఎమ్మార్పీపై మూడు రెట్లు అధిక ధరకు విక్రయం

బెల్టుషాపుల నిర్వాహకుల దందా

ప్రీమియం బీరు రూ.300..స్ట్రాంగ్‌ రూ.350

మద్యం దుకాణాలకు వేసిన సీల్‌ తొలగిస్తున్న వైనం

లాక్‌డౌన్‌లోనూ యథేచ్ఛగా అమ్మకాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: బీరు కావాలా.. రూ.300 ఇవ్వు. ఫలానా బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ అయితే.. రూ.2,500. స్ట్రాంగ్‌ బీరు అయితే రూ.350 అని బెల్టుషాపుల నిర్వాహకులు ఆఫర్లు ఇస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలవుతున్నా.. పల్లెలు, పట్టణాలను మద్యం ముంచెత్తుతోంది. వైన్సులు, బార్లకు మూతపడినా బెల్టు షాపుల్లో జోరుగా లభ్యమవుతోంది. 11 రోజుల నుంచి బయట ఎక్కడా మద్యం అందుబాటులో లేకపోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ధరలను మూడింతలు పెంచేశారు. కొన్ని రోజులుగా జిల్లాలో ఏడెనిమిది చోట్ల జరిగిన దాడుల్లో పోలీసులు మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు కదలడం లేదు. స్థానికంగా సివిల్, ఎక్సైజ్‌ పోలీసుల సహకారంతో ఈ అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఊరూరా బెల్టు దుకాణాలే..
జిల్లా వ్యాప్తంగా 195 మద్యం దుకాణాలు ఉండగా.. అనధికారికంగా ఇంతకు మూడు రెట్లు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. దాదాపు చిన్న గ్రామాలు, తండాల్లోనూ మద్యం లభిస్తోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే, అప్పటికే ఎంతో కొంత బెల్టుషాపుల్లో మద్యం నిల్వలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైన్స్‌లు, బార్లు మూతపడడంతో బెల్టుషాపుల నిర్వాహకులకు కలిసివచ్చింది. ఎమ్మార్పీపై మూడు రెట్లకు అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా మద్యం లేకపోవడంతో కొందరు పొరుగు జిల్లాల నుంచి గుట్టుగా తీసుకొచ్చి అమ్ముతున్నారు.  

మూడింతలకు విక్రయం..
సాధారణంగా రూ.1,080 ధర ఉన్న మద్యం బాటిల్‌ను ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. రూ.700 ఉన్న బాటిల్‌ను రూ.1,500కు మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. రూ.140కు లభించే ఒక బ్రాండ్‌ క్వార్టర్‌ను.. రూ.300కు విక్రయిస్తున్నారు. రూ.120 ధర ఉన్న ప్రీమియం బీర్‌ను.. కనిష్టంగా రూ.300కు, గరిష్టంగా రూ.350కు అమ్ముతున్నారు. స్ట్రాంగ్‌ బీరు బాటిల్‌ను రూ.350 తగ్గకుండా విక్రయిస్తున్నారు. అయితే, బెల్టుషాపుల్లో ఎక్కువగా స్టాక్‌ పెట్టుకోవడం లేదు. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవని గ్రహిస్తున్న వీరు ఇతరుల ఇళ్లలో.. లేదంటే బావుల వద్ద నిల్వచేస్తున్నారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చి తెలిసిన వ్యక్తులకు మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల్లోప్రధానంగా చీప్‌ లిక్కర్‌ మొదలుకొని డీలక్స్‌ బ్రాండ్‌ వరకు ఉంటున్నాయి. నిత్యం మత్తుకు అలవాటు పడిన కొందరు అధిక ధరలకు కొనుగోలు చేసి జేబు గుల్ల చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల వైన్సుల్లో పనిచేస్తున్న బాయ్స్‌ వద్ద కూడా మద్యం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ఇటువంటి వారు అధిక ధరలకు అమ్ముతున్నారు. 

పోలీసుల సహకారం!
స్థానిక సివిల్, ఎక్సైజ్‌ పోలీసుల సహకారంతోనే బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే తప్ప వీరు తనిఖీలు చేయడం లేదు. ఎక్కువ మొత్తంలో మద్యం నిల్వలు లభించినా.. దాన్ని పరిమిత స్థాయిలో లెక్కల్లో చూపిస్తున్నారు. ఫలితంగా నిర్వాహకులకు కేసులు తప్పి బైండోవర్లతో సరిపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

లెక్కేలేదు..
లాక్‌డౌన్‌తో జిల్లాలోని దాదాపు అన్ని మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌ పోలీసులు సీల్‌ వేశారు. అయితే, ఆ షాపుల్లో ఉన్న మద్యం నిల్వలను లెక్కించలేదు. దీన్ని ఆసరా చేసుకుని.. సీల్‌ను తొలగించి మద్యాన్ని బెల్టుషాపుల నిర్వాహకులకు అమ్ముతున్నారు. ఎమ్మార్పీపై రెండింతలకు వారికి అంటగడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లు తమ లాభం చూసుకుని మూడింతల ధరలకు మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు.   

దుకాణం సీలు తొలగించి మద్యం విక్రయం
మాడ్గుల: లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మాడ్గుల మండల కేంద్రంలోని మద్యం దుకాణం నుంచి విక్రయాలు జరిపారు. వైన్‌షాపునకు అధికారులు వేసిన సీల్‌ను బుధవారం ఉదయం తొలగించి అమ్మకాలు ప్రారంభించారు. పలు గ్రామాల బెల్టుషాపుల నిర్వాహకులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కొక్కరుగా వచ్చి మద్యం తీసుకెళ్లారు. వైన్‌షాపు తెరిచి మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో మద్యం ప్రియులు అధిక సంఖ్యలో వెళ్లారు.  అక్కడ గుంపు ఏర్పడడంతో షాపు యజమాని దుకాణం మూసివేసి పరారయ్యారు. కనకదుర్గ వైన్‌షాపునకు వేసిన సీల్‌ తొలగించి మద్యం అమ్మకాలు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని,  షాపును సందర్శించి వివరాలు సేకరించామని ఆమనగల్లు ఎక్సైజ్‌ శాఖ సీఐ వేణుకుమార్‌ తెలిపారు. సమగ్రంగా విచారణ చేపట్టి వైన్స్‌ యజమానిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత  
కందుకూరు: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కారుతో పాటు 104 మద్యం సీసాలను సీజ్‌ చేశారు. కందుకూరు మండల పరిధిలోని అగర్‌మియాగూడకు చెందిన అండే మహేందర్, అండే శ్రీనివాస్‌ ఇద్దరూ నల్లగొండ జిల్లా మర్రిగూడకు చెందిన గణేష్‌ వద్ద 104 మద్యం, బీరు సీసాలు కొనుగోలు చేసి టాటా సఫారీ వాహనంలో తీసుకువస్తుండగా బుధవారం సాయంత్రం తిమ్మాపూర్‌ సమీపంలో కారును పోలీసులు తనిఖీ చేశారు. అందులో మద్యం సీసాలు ఉండడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కారుతో పాటు మద్యాన్ని సీజ్‌ చేసినట్లు సీఐ జంగయ్య తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top