9 నుంచి ‘మద్యం’ దరఖాస్తులు

Liquor Applications Will Accept From Oct 9 To Get Licence - Sakshi

16 వరకు గడువు.. 18న డ్రా

ఆరు స్లాబులుగా గుర్తింపు

ఈ సారి ఈఎండీ మినహాయింపు

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి

సాక్షి, జనగామ: ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురాగా ఈ నెల తొమ్మిదో తేదీన గెజిట్‌ విడుదల చేసి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుడుతుందని జిల్లా ఎక్సైజ్‌  సూపరింటెండెంట్‌ ఆర్‌.మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 మద్యం షాపులతో పాటు మరో దుకాణం రఘునాథపల్లికి షిఫ్టింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మునిసిపల్‌ మినహా ఆయా మండలాల పరిధిలోని నేషనల్‌ హైవేలకు 221 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలన్నారు. దేవాలయం, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. నాలుగు స్లాబులు సిస్టంకు బదులుగా ప్రభుత్వం ఈ సారి ఆరు స్లాబుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రెండేళ్లకు లైసెన్స్‌ ఫీజు రూ. కోటి (రెండు దుకాణాలు), 5001 నుంచి 50 వేల వరకు రూ.1.10 కోట్లు (25 దుకాణాలు), 50 వేల నుంచి లక్ష వరకు  రూ.1.20 కోట్లు (12), లక్షా ఒక్కటి నుంచి 5 లక్షల వరకు రూ.1.30 కోట్లు (జనగామలో లేవు), 5 లక్షల ఒక్కటి నుంచి 20 లక్షల వరకు రూ.1.70కోట్లు (02), 20 లక్షల పైన రూ.2.20కోట్లకు (జనగామలో లేవు) సంబంధించి ఆరు స్లాబులను ప్రకటించారన్నారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న వ్యాపారులు రెండేళ్ల కాలంలో ఎనిమిది వాయిదా పద్ధతుల్లో చెల్లించాలన్నారు.

18న డ్రా తీయనున్న కలెక్టర్‌
ఈ నెల 18వ తేదీన తేదీన సిద్దిపేట రోడ్డు షామీర్‌పేట శివారులోని బాలాజీ కన్వెన్షన్‌ హాలులో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సమక్షంలో డ్రా తీయనున్నట్లు చెప్పారు. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్‌ ఫీజు రూ. రెండు లక్షలకు సంబంధించి డీడీ లేక చలాన్‌ ఇస్తే సరిపోతుందన్నారు.  ఈ సారి రూ.ఐదు లక్షల ఈఎండీ మినహాయించినట్లు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ 67 శాతం నుంచి 50 శాతానికి ప్రభుత్వం తగ్గించిందన్నారు. 

క్లస్టర్లుగా విభజన
మద్యం దుకాణాల దారులకు కొంతమేర ఊరటకలిగించే విధంగా ఈ సారి కొత్తగా మునిసిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. షాపు ఏర్పాటు కోసం మూడు నుంచి నాలుగు వార్డులను కలిపి దుకాణం(100 మీటర్ల దూరంలో గుడి, బడి) మినహాయించి ఎక్కడైనా వ్యాపారం చేసుకునేలా వెసలుబాటు కల్పించామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో 1, 2, 3, 10 (1వ క్లస్టర్‌), 5, 7, 8 (2వ క్లస్టర్‌), 17, 18, 21, 22 (3వ క్లస్టర్‌), 23, 24, 25, 26 (4వ క్లస్టర్‌)గా విభజించినట్లు చెప్పారు. 

మరో కొత్త షాపు
జిల్లాలో ప్రస్తుతం 41 మద్యం దుకాణాలు ఉండగా.. ఒకటి పెరగనుంది. రాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న వైన్స్‌ షాపును రఘునాథపల్లికి షిప్టింగ్‌ చేసినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం జిల్లాలో 1280 దరఖాస్తులు రాగా, ఈ సారి ఈఎండీ మినహాయించడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎక్సైజ్‌ సీఐలు నాగేశ్వర్‌రావు, బ్రహ్మానందరెడ్డి, ముకుందరెడ్డి, ఎస్సై సుధీర్‌ ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top