రమ్య అనే నేను..

Leukemia Patient Ramya one Day CP For Rachakonda - Sakshi

ఒక రోజు రాచకొండ సీపీగా విధులు

లుకేమియాతో బాధపడుతున్న రమ్య

కమిషనర్‌ కావాలనే కోరికను తీర్చిన సీపీ  

పోలీసుల గౌరవవందనం

నేరేడ్‌మెట్‌: చిన్నతనం నుంచి చలాకీగా తిరుగుతూ..చదువులో చురుకుదనం..ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ బాలికపై విధి చిన్న చూపు చూసింది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఎంతో ఆశించింది. పోలీస్‌ కమిషనర్‌ కావాలనేది ఆమె జీవితాశయం. అయితే ప్రాణాంతక వ్యాధి రూపంలో మృత్యువు ఆమెను కబలిస్తోంది. మరణానికి చేరువలో ఉన్న ఆమె కలను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌భగవత్‌ నేరవేర్చారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ ఇందుకు వేదికైంది.  వివరాల్లోకి వెళితే... ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య(17). స్థానిక చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌(ఎంపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె  నిమ్స్‌ ఆసుపత్రిలో వైద్యులు(ఆంకాలజీ)  కిరణ్‌ ఆధ్వర్యంలో  చికిత్స పొందుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న రమ్యకు పోలీసు కమిషనర్‌ కావాలనేది జీవితాశయం.

పోలీసు అధికారులు,మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో  రమ్య
ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌’ నిర్వాహకులు రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ను కలిసి రమ్య కోరికను వివరించారు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో  మంగళవారం ఫౌండేషన్‌ ప్రతినిధులు, తల్లిదండ్రులు, రమ్యను కమిషనరేట్‌కు తీసుకువెళ్లి  సీపీ మహేష్‌భగవత్‌ను కలిశారు. పోలీస్‌ యూనిఫాంలో కమిషరేట్‌కు వచ్చిన రమ్యకు కార్యాలయం సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేశారు. రాచకొండ  కమిషనర్‌గా మహేష్‌భగవత్‌ రమ్యకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీపీ ఆమెను స్వయంగా కమిషనర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. రిజిస్టర్‌లో సంతకం చేసి, ఒక రోజు కమిషనర్‌గా రమ్య విధులు నిర్వర్తించారు.  2017లో ఎహ్‌హాన్‌ అనే బాలుడు ఇదే తరహాలో ఒక రోజు కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మహేష్‌భగవత్, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ రమ్య త్వరలోనే కోలుకోవాలని కోరారు. ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రమ్య సీపీతో పాటు ఇతర అధికారులకు శెల్యూట్‌ చేసి, తనకు ఒక రోజు కమిషనర్‌గా  అవకాశం కల్పించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శిల్పవల్లి, శామీర్, రమ్య తల్లిదండ్రులు నర్సింహ్మ, పద్మ, ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రియాజోషి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

చాలా సంతోషంగా ఉంది..
ఒక రోజు రాచకొండ కమిషనర్‌గా పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో  పోలీసులు కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలి. ఠాణాల్లో 5 ఎస్‌ల అమలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌  కమిషనరేట్‌కు పేరు తెచ్చాయి. మహిళల భద్రత, రక్షణకు షీటీంలు బాగా పని చేస్తున్నాయి.–రమ్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top