ఎయిర్‌పోర్టులో మరో మైలురాయి

LED Sign Boards In RGIA Airoport - Sakshi

ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌ లైటింగ్‌లో ఎల్‌ఈడీ సైన్‌బోర్డులు  

ఏటా 45 శాతం విద్యుత్‌ ఆదా

శంషాబాద్‌:పర్యావరణ హితంగా అడుగులు వేస్తున్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మరో ముందడుగు వేసింది. విమానాశ్రయాన్ని వందశాతం ఎల్‌ఈడీ వెలుగులతో నింపినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు  సంస్థ ప్రకటించింది. ఆరునెలల కిందట ఆరవైశాతం ఎల్‌ఈడీ దీపాలను అమర్చిన జీఎంఆర్‌ సంస్థ తాజాగా ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైన్‌ బోర్డులను సైతం పూర్తి స్థాయిలోకి ఎల్‌ఈడీ  దీపాలను అమర్చింది. ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు ఫ్లోరోసెంట్‌ దీపాలు ఉన్న చోట్ల మొత్తం 350 ఎల్‌ఈడీ దీపాలను అమర్చింది. ఈ దీపాలను కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అమర్చారు.

ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న ఈ సైన్‌ బోర్డులు రాత్రి సమయాలతో పాటు ఉదయం వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతో పాటు వాటిని పార్కింగ్‌ చేసేందుకు సూచికలుగా ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. వందశాతం ఎల్‌ఈడీ ఏర్పాటుతో ఎయిర్‌పోర్టులో ఏటా 45 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కర్బన రహితంగా ఉండడంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. పర్యావరణ హితంగా ఎయిర్‌పోర్టు ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుందని ఈ సందర్భంగా సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌ అన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టును వందశాతం ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం మరో మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే పగటి సమయాల్లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top