ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ!

Leaders Of Trade Unions Giving Agreement Letter To Transco CMD Prabhakar Rao - Sakshi

తదుపరి వేతన సవరణ వర్తింపు

సాక్షి,హైదరాబాద్‌: ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ, సర్వీసు రిజిస్ట్రర్ల నిర్వహణ, తదుపరి పీఆర్సీ నుంచి వేతన సవరణ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, కన్వినియన్స్, మెడికల్‌ తదితర అలవెన్సులు, కారుణ్య నియామకాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో వారితో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌(టీటఫ్‌) ప్రకటించింది. వరంగల్‌లో 23న తలపెట్టిన మహాధర్నాను విరమించుకుంటున్నట్లు ఫ్రంట్‌ చైర్మన్, కన్వీనర్‌ పద్మారెడ్డి, శ్రీధర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులు శనివారం విద్యుత్‌ సౌధలో టీటఫ్, తెలంగాణ విద్యుత్‌ కార్మిక సంఘాల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిగాయి.న్యాయమైన, సాధ్యమైన అన్ని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అంగీకరించారు. స్టాండింగ్‌ ఆర్డర్స్‌ పేరుతో 23 వేలమంది ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సర్వీస్‌ రూల్స్‌ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌గా మార్చుతామని అధికారులు హామీ ఇచ్చారు.1999– 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్‌ వర్తింపు వంటి ప్రధాన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.

మిగిలిన డిమాండ్ల విషయంలో నవంబర్‌ మూడో వారంలో మరోసారి చర్చలు నిర్వహిస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చాయి.చర్చలు సఫలం కావటంతో కార్మిక సంఘాలు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించాయి.చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్‌ అధికారులు, కార్మికులు సంతకాలు చేశారు.చర్చల్లో ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, టీటఫ్‌ చైర్మన్‌ నాయకులు సాయిబాబు, ఎంఏ వజీర్, ఎస్‌. ప్రభాకర్, ఎండీ అబ్దుల్‌ మజీద్, సాయిలు, టీఆర్‌వీకేఎస్‌ అధ్యక్షుడు జాన్సన్, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఒప్పందంలోని ప్రధానాంశాలు
►స్టాండింగ్‌ ఆర్డర్స్‌ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌గా మార్పు 
►ప్రస్తుతం ఆర్టిజన్లు పొందుతున్న కన్సాలిడేటెడ్‌ వేతనాన్ని సంరక్షిస్తూనే, ప్రస్తుత నోటిఫైయిడ్‌ స్కేల్‌కు అనుగుణంగా 2019 అక్టోబర్‌ 1 నాటి నుంచి ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ (పే ఫిక్సేషన్‌) చేస్తాం.కనీస స్కేలును వేతనం మించితే వారి వ్యక్తిగత అలవెన్సులుగా పరిగణించబడుతాయి.  
►నోటిఫైయిడ్‌ స్కేల్‌ ప్రకారం వీడీఏకు బదులు డీఏ చెల్లింపు.  
►హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, వైద్య ఖర్చులు, రవాణా భత్యం, కార్పొరేట్‌ అలవెన్స్‌ వర్తింపు.  
►ఆర్టిజన్లందరికీ సర్వీసు రిజిస్ట్రర్లు తెరిచి సర్వీసు రిజిస్ట్రర్‌లో వేతన స్థిరీకరణ ఎంట్రీలు నమోదు 
►ఆర్టిజన్లందరికీ పే స్లిప్పులు జారీ  
►పెయిడ్‌ హాలిడేలు వర్తింపు 
►తదుపరి వేతన సవరణ కాలం నుంచి ఆర్టిజన్లకు సైతం వేతన సవరణ అమలు  
►2016 డిసెంబర్‌ 4 తర్వాత మరణించిన ఆర్టిజన్ల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన. 
►ఆర్టిజన్లపై క్రమశిక్షణ చర్యలను అధీకృత అధికారి మాత్రమే పరిశీలిస్తారు  
►ఆర్టిజన్లకు వర్తింపజేసిన సదుపాయాలను రెస్కో ఉద్యోగులకు వర్తింపు 
►ఆర్టిజన్లకు అంత్యక్రియల చార్జీలు చెల్లింపు 
►ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్‌ అమలు చేసే అంశంపై చర్చించేందుకు టీటఫ్‌ బృందాన్ని సీఎం కేసీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది.  
►యూనియన్ల ప్రతిపాదనల మేరకు ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌కు సవరణలు చేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top