సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ

Lawyers Refused To Argue On Behalf Of Samatha Accusers Side - Sakshi

న్యాయవాదులను నియమించుకునేందుకు నిందితులకు ఒకరోజు గడువు

నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

తదుపరి విచారణ నేటికి వాయిదా

సాక్షి, ఆదిలాబాద్‌: సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ఈ కేసులోని నిందితుల రిమాండ్‌ ముగియడంతో జిల్లా జైలు నుంచి పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. వారి కేసును ఎవరు వాదించవద్దని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. న్యాయవాదులను నియమించుకునేందుకు నిందితులు కోర్టును మూడు రోజుల సమయం కోరారు. కాగా మంగళవారం ఉదయం 10గంటల వరకు గడువు ఇచ్చింది. నిందితులను పోలీసులు జుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మంగళవారం తదుపరి విచారణ కోసం నిందితులను హాజరుపర్చనున్నారు. ఆదిలాబాద్‌లోని స్పెషల్‌ ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమత కేసు నిందితులైన షేక్‌ బాబు, షేక్‌ శాబొద్దీన్, షేక్‌ ముగ్దుమ్‌లపై విచారణ జరగనుంది.

జుడీషియల్‌ కస్టడీకి..
నిందితులపై లింగాపూర్‌ పోలీసులు 376–డి, 404, 312, 325, 3(2)(5)ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం రిమాండ్‌ గడువు ముగియడంతో కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపర్చారు. జుడీషియల్‌ కస్టడీకి న్యాయస్థానం వారిని అప్పగించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి, సెల్‌ఫోన్, రూ.200లతో పాటు 72 రకాల వస్తువులను కోర్టులో పోలీసులు డిపాజిట్‌ చేశారు. వీటిలో సమత దుస్తులు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు కోర్టులో డిపాజిట్‌ చేసినట్లు ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

మొత్తం 44 మంది సాక్షులు..
ఒకవేళ న్యాయవాదులెవరూ కేసును వాదించేందుకు ముందుకు రాకపోతే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా, ప్రభుత్వం తరఫునుంచైనా న్యాయవాదిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మొత్తం 44 మంది సాక్షులను పోలీసులు సేకరించగా, రోజు కొంతమంది కోర్టులో హాజరుకానున్నట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top