శివయ్యా.. బతికించావయ్యా..! 

Landslides Fell On The Srisailam Ghat Road In Mahabubnagar - Sakshi

దోమలపెంట(అచ్చంపేట) : శ్రీశైలం ఆనకట్ట ఘాట్‌ రోడ్డులో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడం తో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. శివయ్యా.. బతికించావయ్యా.. అంటూ ప్రయాణికులు ఊపరిపి పీల్చుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ప్రాం తంలో కుండపోత  వర్షం కురిసింది. ఆనకట్ట వద్ద శ్రీశైలం ఘాట్‌రోడ్డులో వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో రోడ్డు ప్రొటక్షనల్‌ కూలిపోయింది. దీంతో కొండ చరియలు దిగువనున్న ఘాట్‌ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి.     

ఎస్‌పీఎఫ్‌ సేవలు భేష్‌ 
సమాచారం అందుకున్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రం రక్షణ బాధ్యతలు చూస్తున్న ఎస్‌పీఎఫ్‌ (స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌) ఎస్‌ఐలు జి.శ్రీనివాస్, ఎం.రంగయ్య, సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం బండరాళ్ల తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్, ఉప సర్పంచ్‌ ప్రసాద్, పాతాళగంగ అంజిలు సైతం స్పందించి టూరిజం పనులు చేస్తున్న  ప్రొక్లయిన్‌తో రోడ్డుపై అడ్డంగా పడిన బండరాళ్లను తీయించారు. వీటిని తీయడానికి  సుమారు మూడు గంటల సమయం పట్టింది.

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వస్తున్న వాహనాలన్నింటిని ఈగలపెంట వద్దనున్న జెన్‌కో గ్రౌండ్‌లో పార్క్‌ చేయించారు. జరిగిన సంఘటనను తెలియపరచి కొండచరియలను తొలగించిన తర్వాత పంపించారు. మరోవైపు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న వాహనాలను భూగర్భ కేంద్రం పీఏటీ ప్రాంతం వద్ద నిలిపివేయించారు. రాళ్లను తొలగించిన అనంతరం  నెమ్మదిగా ఘాట్‌నుంచి దాటించారు. అనంతరం భూగర్భ కేంద్రం చీఫ్‌ ఇంజినీర్‌ మంగేష్‌కుమార్‌ ఎస్‌పిఎఫ్‌ పోలీసులు పర్యాటకులు, భక్తులకు అందించిన సేవలను ప్రశంసించారు.  

ప్రమాదకరంగా రహదారి 
ఇదిలాఉండగా కొండచరియలు పడిన ప్రతి సారి రోడ్డుపైనున్న మరో రోడ్డులో కూలిపోయిన రోడ్డు ప్రొటక్షన్‌ వాల్‌ క్రమంగా పెద్దదవుతూనే ఉంది. దీంతో రాళ్లు ద్రొర్లుతూ వచ్చి దిగువ రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆనకట్ట ఘాట్‌ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది.  ఆర్‌అండ్‌బీ అధికారులు యుద్దప్రాతిపదికన స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. 

ఆకలితో అలమటించిన ప్రయాణికులు 
ఇదిలాఉండగా అనుకోని విధంగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో మూడు గంటలపాటు ప్రయాణికులు వాహనాల్లో ఇబ్బంది పడ్డారు. ఈగలపెంటలో పర్యాటకులు, భక్తులు వాహనాలు, ఆర్టీసి బస్సులను నిలిపివేయడంతో నిరీక్షించాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న హోటళ్లలో  టీ, టిఫిన్‌ అయిపోవడంతో చాలామంది ఆకలితో అలమటించారు. తాగడానికి, సేద తీరడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో పర్యాటకులు ఇక్కట్ల పాలయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top