కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర  | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర 

Published Wed, May 8 2019 1:41 AM

Lanco bankruptcy series ongoing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాంకో గ్రూపు కంపెనీల దివాలా పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కంపెనీ దివాలా ప్రక్రియ జాబితాలో చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్‌ లిమిటెడ్‌ దివాలాకు అనుమతినిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్‌ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కోల్‌కతాకు చెందిన పంకజ్‌ దనుఖాను తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ)గా నియమించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్, నాఫ్తా ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం ల్యాంకో కొండపల్లి పవర్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. కార్యకలాపాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ పెద్దఎత్తున రుణాలు తీసుకుంది.

ఈ విధంగా యాక్సిస్‌ బ్యాంకుకు 2018 ఆగస్ట్‌ 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్‌ బ్యాంకు ఎన్‌సీఎల్‌ టీని ఆశ్రయించి, ల్యాంకో కొండపల్లి దివాలాను ప్రారంభించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి విచారణ జరిపారు. ల్యాంకో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదుపులో లేని పరిస్థితుల వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. గ్యాస్‌ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిందని, గ్యాస్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ ప్రారంభించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

తరువాత యాక్సిస్‌ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ల్యాంకో కొండపల్లికి ఏ సంబంధం లేదని తెలిపింది. రుణం చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా ల్యాంకో కొండపల్లి స్పందించలేదన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, ల్యాంకో కొండపల్లి దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీల ఆస్తుల క్రయ, విక్రయాలు, బదలాయింపులపై నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది.  

Advertisement
Advertisement