పారదర్శకంగా అభివృద్ధి పనులు

KTR Starts Devolopment Works In Hyderabad - Sakshi

ప్రజా రవాణాతోనే ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌  

ఆగస్టు నాటికి మెట్రో రెండో దశ  

రూ.23 వేల కోట్లతో అభివృద్ధి పనులు

54 జంక్షన్ల అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గాలంటే ప్రజారవాణా వ్యవస్థ వినియోగం పెరగాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముంబైలో 70 శాతం మంది ప్రజా రవాణాను వినియోగించుకుంటే, హైదరాబాద్‌లో 34 శాతం మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు. శుక్రవారం కొండాపూర్‌లో మల్టీలెవెల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు మంత్రి మహేందర్‌ రెడ్డి, మేయర్‌ రామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసిశంకుస్థాపన చేశారు.

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గాలంటే ప్రజారవాణా వ్యవస్థ వినియోగం పెరగాల్సి ఉందని మునిసిపల్‌ మంత్రి కె. తారకరామారావు అన్నారు. నగరంలో  ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా పారదర్శకంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. శుక్రవారం కొండాపూర్‌లో మల్టీలెవెల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతురామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంబైలో  70 శాతం మంది ప్రజారవాణాను వినియోగించుకుంటుండగా, హైదరాబాద్‌లో 34 శాతం మంది మాత్రమే ప్రజారవాణాపై అధారపడుతున్నారన్నారు. ఈ సమస్య  పరిష్కారానికి ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.  వ్యూహత్మకంగా రోడ్ల అభివృద్ధిని చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, శేరిలింగంపల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

ట్రాఫిక్‌కు అనుగుణంగా మౌలిక  వసతులు కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. నగరంలో రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్ల అభివృద్ధి, 111 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం  3వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని,  మరో రూ.  2,351 వేల కోట్ల పనులు టెండర్‌ దశలో,  రూ. 2,686 కోట్ల మేర మంజూరు దశలో ఉన్నట్లు తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి తాత్కాలిక ఇబ్బందులను భరించాలని ప్రజలకు సూచించారు.  సోషల్‌ మీడియాలో పలువురు రోడ్ల దుస్థితిపై విమర్శలు చేస్తున్నారని, ఫ్లై ఓవర్ల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన్‌లు, రహదారుల మరమ్మతులు జరుగుతున్నందున ఇబ్బందులు తప్పవన్నారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇంటింటికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో పైపులైన్‌ ఏర్పాటు కోసం 3 వేల కిలోమీటర్ల రోడ్లను తవ్వినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

18 నెలల్లోగా ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి..
కొండాపూర్, కొత్తగూడలో రూ. 263 కోట్లతో మూడు కిలోమీటర్ల పొడవున  నిర్మించనున్న ఫ్లై ఓవర్‌  18 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇంకా ముందే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ  అధికారులు జవాబుదారీ తనంతో పనిచేస్తున్నారన్నారు. 

నవంబర్‌లో మెట్రో మూడో దశ..
ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో భాగంగా మెట్రో రెండోదశ ఎల్‌బీనగర్‌– అమీర్‌పేట ఆగస్టులో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో దశలో హైటెక్‌సిటీ వరకు నవంబర్‌ నాటికి మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 80 నుంచి 85 వేల మంది  ప్రయాణిస్తున్నారని,  అన్ని దశలు పూర్తయితే రోజుకు  12 నుంచి 14 లక్షల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. మెట్రోస్టేషన్ల నుంచి ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాహన  కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ తొలిదశలో  500 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ హరిచందన, జీహెచ్‌ఎంసీ సీఈ శ్రీధర్‌ పాల్గొన్నారు.

టెండరు దశలో..
రూ.426 కోట్లతో ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు ఎలివేటెడ్‌ కారిడార్, రూ.225 కోట్లతో సైబర్‌ టవర్‌ ఎలివేటెడ్‌ రోటరీ, రూ.175 కోట్లతో రేతిబౌలి, నానల్‌నగర్‌ ఫ్లైఓవర్, రూ.330 కోట్లతో శిల్పా లేవుట్‌ నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్, రూ.523 కోట్లతో నల్గొండ ఎక్స్‌ రోడ్డు నుంచి ఒవైసీ హాస్పిటల్‌ ఎలివేటెడ్‌ కారిడార్, రూ.636 కోట్లతో జూపార్క్‌ నుంచి ఆరాంఘర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ , రూ.37 కోట్లతో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ఎక్స్‌టెన్షన్‌ పనులు టెండర్‌ దశలో  ఉన్నట్లు తెలిపారు. రూ.875 కోట్లతో ఖాజాగూడ టన్నెల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ మంజూరు దశలో ఉందన్నారు. నేషనల్‌ హైవే మీద మూడు ఎలివేటెడ్‌కారిడార్ల పనులు రూ. 1500 కోట్లతో చేపట్టామన్నారు. 

టైం బౌండ్‌తో పనిచేస్తున్నాం..
శేరిలింగంపల్లిలో ఇప్పటికే అయ్యప్పసొసైటీ, మైండ్‌ స్పేస్‌ జంక్షన్లలలో అండర్‌ పాస్‌లను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2018 జూలైలో కామినేని ఎడమ వైపు ఫ్లైఓవర్,  ఆగస్టులో మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్,  సెప్టెంబర్‌లో ఎల్‌బీనగర్‌లో ఎడమవైపు ఫ్లైఓవర్, డిసెంబర్‌లో కూకట్‌పల్లి రాజీవ్‌ గాంధీ విగ్రహం ఫ్లైఓవర్, ఎల్‌బీనగర్‌ ఎడమ వైపు అండర్‌ పాస్, 2019 మార్చిలో దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, బైరామల్‌గూడ, కామినేని హాస్పిటల్‌ కుడివైపు ఫ్లైఓవర్లు, సెప్టెంబర్‌లో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 ఫ్లై ఓవర్, ఒవైసీ హాస్పిటల్‌ ఫ్లైఓవర్, బాలానగర్‌ గ్రేడ్‌ సెపరేటర్,  డిసెంబర్‌లో షేక్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్, కొత్తగూడ గ్రేడ్‌ సెపరేటర్, మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయని  తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top