త్వరలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌

KTR says that establishment of six airports in the state - Sakshi

ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదన  

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం వెల్లడించారు.అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్‌ తేనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా అడక్కల్‌ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు వరంగల్‌ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్‌ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

వింగ్స్‌ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించాం. వరంగల్‌ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది.మెగా టెక్స్‌టైల్‌ పార్క్, ఐటీ హబ్‌కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్‌’లో భాగంగా వరంగల్‌ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్‌లో తొలి అటానమస్‌ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్‌ ప్రయాణించారు. డ్రైవర్‌ లేకుండానే నడుస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top