4లక్షల ఉద్యోగాలు

KTR Meets Indian Pharmaceutical Alliance Officials At Mumbai - Sakshi

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలపై మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్‌ రంగం వాటా 50 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2030 నాటికి వంద బిలియన్‌ డాలర్లకు చేర్చడంతో పాటు, నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముంబాయిలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయెన్స్‌ (ఐపీఏ) ప్రతినిధులతో పాటు ఫార్మా రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఫార్మాస్యూటికల్, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వెల్లడించడంతో పాటు, ఐపీఏ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సిరిసిల్ల అపరెల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తూ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ షాపర్స్‌స్టాప్‌ ఎంవోయూపై సంతకాలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా సిరిసిల్ల అపరెల్‌ పార్కులో వందలమంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఒప్పందం అనంతరం ముంబయిలోని వస్త్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కేటీఆర్‌ చర్చలు జరిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ ప్రత్యేకతలను వారికి వివరించారు. టెక్స్‌టైల్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల ప్రత్యేకతలతో పాటు, ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన ఈ భేటీల్లో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, లైఫ్‌ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top