అక్రమ అనుమతులు తీసుకుంటే కూల్చివేతలే: కేటీఆర్‌

KTR Meeting With State Level Town Planning Officers  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని చేపడుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయి టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం చేపడుతున్నామన్నారు. టీఎస్ ఐపాస్ మాదిరిగా నూతన భవన నిర్మాణ అనుమతులు విధాన రూపకల్పన జరుగుతోందన్నారు.

సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా.. అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టౌన్‌ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు పురపాలక శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top