సహకరిస్తాం.. పనులు చేపట్టండి 

Kotha Prabhakar Reddy Review on Railway pending works - Sakshi

రైల్వే పెండింగ్‌ పనులపై జీఎం,ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలోని వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను రైల్వే జీఎంతో చర్చించారు. 

- ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2లో భాగంగా చేపట్టిన తెల్లాపూర్‌–రామచంద్రాపురం లైన్‌ను వెంటనే ప్రారంభించాలని జీఎంను ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టుకు  రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉందని, అవి రాగానే ప్రారంభిస్తామని జీఎం చెప్పారు. 
- తెల్లాపూర్‌– బీహెచ్‌ఈఎల్‌ మార్గంలోని రైల్వే అండర్‌ పాస్‌ ఇరుగ్గా మారిందని, దీనిని విస్తరించాలని ఎంపీ కోరారు. ఇందుకోసం రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేయించేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఎంపీ తెలిపారు. నిధులు విడుదల చేస్తే, పనులు మొదలుపెట్టేందుకు  అభ్యంతరం లేదని జీఎం సమాధానమిచ్చారు. 
- కొల్లూరు సర్వీసు రోడ్డు వద్ద ఉన్న రైల్వేట్రాక్‌పై ఆర్వోబీ నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంది. హెచ్‌ఎండీఏ– రైల్వే అధికారులకు ఈ విషయంలో సమన్వయం కొరవడిన కారణంగా ఈ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కోరగా డీపీఆర్‌ సిద్ధమై నిధులు విడుదలైతే వెంటనే మొదలుపెడతామని జీఎం హామీనిచ్చారు. 
- ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే టెర్మినల్‌ నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనికోసం అక్కడ 300 ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే అక్కడ 150 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. ఇక మిగిలిన 150 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీఎంకు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై హెచ్‌ఎండీఏ– రైల్వే అధికారులు చీఫ్‌ సెక్రటరీ జోషీతో కలసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశానని ఎంపీ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top