మేయర్‌పై అవిశ్వాసానికి కార్పొరేటర్ల ప్లాన్‌

Khammam Corporators Meet MLA Ajay Against Mayor - Sakshi

ఖమ్మం మేయర్‌ పాపాలల్‌పై అవిశ్వాసానికి పట్టు

రంగంలోకి ఎమ్మెల్యే అజయ్‌.. సీఎం దృష్టికి పంచాయతీ

సాక్షి, ఖమ్మం:  ఖమ్మం నగర మేయర్‌ పాపాలాల్‌కు సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే తిరుగుబాటు ఎదురైంది. పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కార్పొరేటర్ల అంతా భేటీ అయ్యారు. మొత్తం 42 మందికి గాను 37 మంది సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఎమ్మెల్యేకి అందించారు. ఈ సందర్భంగా అజయ్‌ వద్ద కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాపాలాల్‌ తమ డివిజన్‌ పర్యటనకు వచ్చిన తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని వాపోయారు.

దీనికి స్పందించిన అజయ్‌కుమార్‌.. తాజా పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పార్టీకి నష్టం చేసే ఎలాంటి చర్యలను కూడా సమర్థించమని  స్పష్టం చేశారు. నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్‌ వ్యవహారాలపై,  మేయర్‌ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్‌ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్‌ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వెసులుబాటు కలిగిందని, అవిశ్వాస తీర్మానం చేయాల్సిన పరిస్థితిని డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి తదితరులు వివరించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top