హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌

KCR Will Go Huzurnagar 18th October - Sakshi

ఈ నెల 18న నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ

10 తర్వాత మండలాలు, మున్సిపాలిటీల్లో కేటీఆర్‌ రోడ్‌షో

సామాజికవర్గాల మద్దతు కూడగట్టడంపైనే టీఆర్‌ఎస్‌ దృష్టి

సర్వేల ద్వారా పార్టీలు, అభ్యర్థుల బలంపై వివరాల సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 18న పాల్గొంటారు. ఈ నెల 21న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా, 19న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో 18న హుజూర్‌నగర్‌ నియోజకవర్గం కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. కేసీఆర్‌ సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దసరా తర్వాత పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందిస్తారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ నెల 4న హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రోడ్‌ షో నిర్వహించారు.

తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో రోడ్‌ షోలు, సభలు నిర్వహించేలా పార్టీ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పర్యవేక్షణలో ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోనూ కేటీఆర్‌ రోడ్‌ షోలుంటాయని పార్టీ నేతలు వెల్లడించారు. ప్రస్తుతం మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పువ్వాడ అజయ్‌ అడపాదడపా ప్రచారానికి వస్తున్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రభావం చూపే ఎస్టీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని.. మంత్రి సత్యవతి రాథోడ్‌ గిరిజన తండాలను చుట్టి వస్తున్నారు.

సామాజికవర్గాల మద్దతు కోసం.. 
ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌.. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జిలను నియమించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా.. 9 మందితో కూడిన కోర్‌ కమిటీ ప్రచార వ్యూహం అమలును పర్యవేక్షిస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, తేరా చిన్నపరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, రాంబాబుయాదవ్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని, వారి మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎస్టీ, కమ్మ, యాదవ, వైశ్య, ముస్లిం మైనార్టి, బ్రాహ్మణ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు రంగంలోకి దిగిన కమిటీలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. ఎస్టీ, కమ్మ సామాజికవర్గం మద్దతు కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో ఆయా సామాజికవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.

సర్వేల ద్వారా పార్టీ పరిస్థితిపై విశ్లేషణ
ఓ వైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భారీగా పార్టీ ఇన్‌చార్జిలను మోహరించిన టీఆర్‌ఎస్‌.. దసరా తర్వాత మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రచా రంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల జాడ లేకపోవడంతో మరింత మంది ఎమ్మెల్యేలు ప్రచార బరిలోకి దిగనున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ప్రైవేటు సంస్థ ద్వారా హుజూర్‌నగర్‌లో పార్టీల బలాబలాలపై టీఆర్‌ఎస్‌ అంతర్గత సర్వే నిర్వహించింది.

సర్వేలో 54 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడించారు. పోలింగ్‌ తేదీలోగా మరిన్ని సర్వేలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్న టీఆర్‌ఎస్‌ తాజాగా మరో సర్వే ఫలితాన్ని విశ్లేషిస్తున్నది. ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులుండగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల వారీగా సర్వే ద్వారా టీఆర్‌ఎస్‌ సమాచారాన్ని సేకరిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top