
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని కందుకూరు మండలం ముచ్చర్లలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.
- 3న ఫార్మా దిగ్గజాలతో కలసి భూముల పరిశీలన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని కందుకూరు మండలం ముచ్చర్లలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 3న బల్క్ డ్రగ్, ఫార్మారంగంలో దిగ్గజాలైన కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ ప్రాంతంలోని భూములను హెలికాప్టర్‌లలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. మరోవైపు రాచకొండ గుట్టల్లోని 25 వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ, ఐటీ తదితర పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచేందుకు బడా ప్రణాళికలు రూపొందించిన సర్కారు... బహుళ జాతి సంస్థలను ఆకట్టుకునేందుకు రాజధాని శివార్లపై కన్నేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌రింగ్‌రోడ్డుకు చేరువలోని రాచకొండ, ముచ్చర్లలో సమృద్ధిగా భూ లభ్యత ఉండడంతో ఈ ప్రాంతాలను వివిధ రంగాల హబ్‌లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఏరియల్ సర్వేకు ముందుగా ఆదివారం పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్‌లతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌లు ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
రాచకొండలో ఫిల్మ్‌సిటీ: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌సిటీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ముచ్చర్లలో ఫార్మాసిటీ: రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులోని కందుకూరు, ఆమన్‌గల్ మండలాల శివార్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముచ్చర్ల మండలం సర్వే నంబర్ 288లోని 2500 ఎకరాలు, పక్కన ఉన్న మరో వేయి ఎకరాల(ఆమన్‌గల్ మండల పరిధి)ను ఫార్మాసిటీ కోసం సేకరించనున్నారు. డిసెంబర్ 3న రెడ్డీస్, అరవిందో, హెటెరో సంస్థల అధినేతలతో కలసి సీఎం విహంగ వీక్షణం చేయనున్నారు.