అభివృద్ధి పేరుతో అయినవారికి దోచిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
విలువైన భూములు ఎకరం 99 పైసలకే ఊరూ పేరూ లేని కంపెనీలకు ధారాదత్తం
లోకేశ్ తోడల్లుడి ‘గీతం’ వర్సిటీకి వేల కోట్ల భూ పందేరం
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న విశ్రాంత ఐఏఎస్‌లు, మేధావులు, విశాఖవాసులు
అయినప్పటికీ అహంకారంతో భూపందేరం ఆపని కూటమి ప్రభుత్వం
99 పైసలకు ఎకరం కాదు.. మొత్తం భూమే ఇచ్చేస్తానన్న లోకేశ్
2014–19లోనూ రికార్డుల ట్యాంపరింగ్‌తో భూ కుంభకోణాలు
ఇప్పుడేమో నచ్చిన కంపెనీలకు అడ్డగోలుగా భూ కేటాయింపులు
నమ్మి ఓట్లేస్తే విలువైన భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని విశాఖ వాసుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు అండ్ కో భూ దాహానికి విశాల విశాఖ బక్కచిక్కిపోతోంది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తామని బీరాలు పలికే చంద్రబాబు... భూ దోపిడీతో విశాఖ పరువుని బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. ఊరూ పేరూ లేని కంపెనీలకు విలువైన స్థలాలను ధారాదత్తం చేసేస్తున్నారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన తమ కుటుంబ సభ్యులకు అధికారికంగా బదలాయించేస్తున్నారు. ఓటేసిన విశాఖ వాసులను మాత్రం వెన్నుపోటు పొడిచేశారు.
సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. ‘గీతం’కు భూ పందేరం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం వర్సిటీకి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇలా చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని 2011 జనవరి 28న జగపాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని భారత అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. అదేవిధంగా 2012 సెపె్టంబర్ 14న జారీ చేసిన జీవో నం.571 ప్రకారం, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌వో) – 24 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చెయ్యకూడదు. వీటన్నింటినీ తుంగలో తొక్కి.. గీతం కోసం ప్రభుత్వం సాగిలపడుతోంది.
అభివృద్ధి పేరుతో అయినవారికి కేటాయింపులు.!
విశాఖ భూముల్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. నచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. కోట్ల రూపాయిలు విలువైన భూముల్ని ఎకరం 99 పైసలకు కట్టబెట్టడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 25న రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్ అనే సంస్థకు అదే ఏడాది ఏప్రిల్‌లో 59.86 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీసీఎస్, కాగ్నిజెంట్.. ఇలా నచ్చిన కంపెనీలకు విశాఖలోని విలువైన భూములను ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైపోయారు.
అవసరమైతే మొత్తం భూమే ఇచ్చేస్తామని మంత్రి లోకేశ్ అంటున్నారు. ఈ భూ దోపిడీపై పలు వర్గాల నుంచి వచ్చిన విమర్శలతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం.. మరికొన్ని కంపెనీలకు ఇదే తరహాలో భూములు ఇచ్చేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతోందనే ఆరోపణలున్నాయి. బీచ్ ఒడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములను లులూ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టేసింది. ఇలా విశాఖలోని భూములన్నింటినీ కొల్లగొట్టేందుకు ప్రభుత్వం స్కెచ్ వేస్తోంది.
2014 – 19 మళ్లీ రిపీట్.!
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు భూ కుంభకోణపర్వం మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు పార్ట్ – 2ను కొనసాగిస్తోంది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలంతా కలిపి.. ఒక మాఫియాలా తయారయ్యారు. అవకాశం ఉన్న చోట రికార్డులను తారుమారు చేయడం, సాధ్యం కాకపోతే కబ్జా చేయడం, ఇంకోచోట ల్యాండ్ పూలింగ్ పేరిట దారుణాలకు దిగడం ఇలా అనేక రూపాల్లో ఈ భూబాగోతాలు సాగిపోయాయి.
లక్షల ఎకరాల్లో భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని అధికారులు ప్రకటించినప్పుడు.. హుద్‌హుద్ సమయంలో భూ రికార్డులు తడిచిపోయాయనే అబద్ధాల్ని వల్లెవేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వేల కోట్లు విలువ చేసే భూముల్ని టీడీపీ భూ బకాసురుల ఆక్రమణల చెర నుంచి విడిపించి ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు మరోసారి కూటమిగా అధికారంలోకి వచ్చి విశాఖ మొత్తాన్ని హోల్‌సేల్‌గా అమ్మేయాలన్నదే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు భూ కేటాయింపులు చేసేస్తోంది. రూపాయికి ఏమొస్తుందో తెలీదు కానీ.. వైజాగ్‌లో మాత్రం ఎకరం భూమి అప్పనంగా వచ్చేస్తోందనేది ప్రస్తుతం రాష్ట్రమంతటా హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తుండడం చట్టాన్ని ఉల్లంఘించడమే. గీతం వర్సిటీ ఆక్రమించేసిన 54 ఎకరాలను ఏ ప్రాతిపదికన వారికిచ్చేస్తున్నారు..? విశాఖలో ఇటీవల జరుగుతున్న భూ కేటాయింపులు సుప్రీంకోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం, మంత్రులు, అధికారులపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ – 1988 కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాను. – ఈఏఎస్ శర్మ, విశ్రాంత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి
కేటాయింపుల వెనుక క్విడ్ ప్రోకో
విశాఖ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనుక క్విడ్ ప్రోకో నడిచిందనే అనుమానాలున్నాయి. ఎకరం 99 పైసలకు ఇస్తున్నట్లుగా చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి. ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఈ భూపందేరాలతో విశాఖ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. – సీహెచ్ నర్సింగరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


