విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములు విశాఖలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన 57 ఎకరాల అత్యంత విలువైన భూములను ఉర్సా కంపెనీకి ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. ఎన్నికల ముందు భూములు కాపాడతామని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు.
శనివారం ఆయన విశాఖ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రూ. 5వేల కోట్ల విలువైన భూమి అక్కడి గీతం సంస్థ ఆధీనంలో ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అత్యంత విలువైన భూములు కట్టబెట్టడం ఏంటని దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం న్యాయం కాదని అందుకే దీని కోసం వైస్సార్సీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టిన వెనక్కితగ్గేది లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.


