లక్షల మందికి ఉపాధి

లక్షల మందికి ఉపాధి - Sakshi


మేడే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వందల కొద్దీ పరిశ్రమలు రాబోతున్నాయని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువగా ఉంటాయని, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి లక్షలాది ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్మిక దినోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రైవేటు రంగ అవకాశాలను అం దిపుచ్చుకునే విధంగా యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణనిస్తామని, తొలుతగా జిల్లాకు ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. వచ్చే జూన్‌లో వీటిని ప్రారంభిస్తామన్నారు. మనం ప్రతి యంత్రాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, భారీ యం త్రాలను తయారుచేసే పరిశ్రమ దేశం లో ఒక్కటీ లేకపోవడం సిగ్గుచేటని వ్యా ఖ్యానించారు. చైనా వం టి దేశాలు ప్రతి వస్తువును మన మార్కెట్లోకి చొప్పిస్తున్నాయని, విదేశీ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలని కేంద్రానికి సూచించారు. కార్మికుల ఈఎస్‌ఐసీ నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయని, వాటిని కార్మికుల కోసం ఖర్చు చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రధాని మోదీలను కోరారు.  పేపర్ మిల్లులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని సీఎం తెలిపారు.

 

 కార్మికులపై వరాల జల్లు..

 

 కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిం చారు. రాష్ట్రంలోని 5.8 లక్షల మంది అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందించే పథకాన్ని మేడే నుంచే అమల్లోకి తెస్తున్నామన్నారు. దానికి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. 16 వేల మంది హోంగార్డులకు, 12 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఈ బీమా వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. నిర్మాణ రంగ కార్మికులు ప్రమాదానికి గురైతే వారికిచ్చే ఆర్థిక సాయాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు చెప్పారు. వివాహానికి రూ.10 వేలు, ప్రసూతి సమయంలో రూ.20 వేలు, ఆస్పత్రి చికిత్స కోసం రూ.3 వేలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.3 లక్షలు, సహజ మరణానికి రూ.60 వేలు అందజేస్తామన్నారు. కార్మికుల కోసం  భవిష్యత్‌లో మరిన్ని పథకాలు తెస్తామని సీఎం చెప్పారు. వచ్చే మార్చినాటికి మరో 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుం దని చెప్పారు.

 లాభాల్లో కొంత కార్మికులివ్వాలి: నాయిని

 

 ప్రతి పరిశ్రమ తమకు వచ్చే లాభాల్లో కొంత మేర కార్మికుల కోసం ఖర్చు చేయాలని మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు.  పరిశ్రమలకు వచ్చే ఆదాయంలో కొంత కార్మికులకు ఇవ్వాలని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.  మేడే వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ యాజమాన్యాలు, కార్మిక నాయకులను కేసీఆర్, దత్తాత్రేయ సత్కరించారు.

 

 

 గీ ఐటీ ఏందో..

 మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ రంగాన్ని ఉద్దేశిస్తూ.. కేసీఆర్ తనదైన శైలిలో చమత్కరించారు. ‘గీ ఐటీ రంగమేందో అసలర్థంగాదు. వస్తువుండదు, పాడుండదు. పెంచుతుంటరు తగ్గిస్తుంటరు. గమ్మత్తు గా ఉంటది. అందులో ఉద్యోగం చేయాలంటే చిలక పలికినట్టు ఇంగ్లిషు పలకాలి. వాడెవడో అమెరికా వాడితో మాట్లాడాలి..’’ అని సీఎం పేర్కొనడంతో మంత్రులతోపాటు అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

 

 రెండేళ్లలో కోటి ఉద్యోగాలు: దత్తాత్రేయ

 కార్మికుల శ్రమను దోపిడీ చేస్తే జైలుపాలు కాక తప్పదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలకు శిక్ష తప్పదని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు సంఘటితమై మరింత బలోపేతం కావాలని సూచించారు. రూ.400 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను స్థాపించనున్నట్టు తెలిపారు. దేశంలోని 39 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ‘యువిన్’ పేరిట స్మార్ట్ కార్డులు అందజేసి తద్వారా వారికి వైద్యసేవలు, జీవిత బీమా, పింఛన్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దుతామన్నారు.

 

 శ్రమశక్తి అవార్డుల ప్రదానం

 

 

 సాక్షి, హైదరాబాద్: కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ పని తీరు కనబరిచిన కార్మిక నాయకులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డులను అందజేశారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబరిచిన సంస్థలకు ఉత్తమ మేనేజ్‌మెంట్ అవార్డులను కూడా అందజేశారు.




 శ్రమశక్తి అవార్డులు పొందినవారు..




 రాపోలు కృష్ణారావు, పి.నారాయణ, మందా సదానందంగౌడ్, ఎం.అశోక్‌రెడ్డి, ఎల్లయ్య, ఇ.వెంకటేశ్, డి.నారాయణరావు, ఎ.శ్రీనివాస్, ఎం.సిరాజుద్దీన్, శంకర్ నాయక్, పి.నర్సయ్య, గోనె దారుగ, ఎం.సంపత్, కె.అమరేశ్వర్, ఎ.వెంకటేశ్వరరావు, మెరుగు శంకర్, సారా రాజయ్య, ఎస్.శ్రీధర్, ఎన్.థామస్‌రెడ్డి, ఎన్.పద్మారెడ్డి




 ‘ఉత్తమ మేనేజ్‌మెంట్’ సంస్థలు




 వీఎస్టీ లిమిటెడ్, సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, మైహోం కన్‌స్ట్రక్షన్స్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్, శాంతా బయోటెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లేజర్ షేవింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్, జె.కె ఫెన్నర్ (ఇండియా) లిమిటెడ్, సూపర్ మాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓరియెంట్ సిమెంట్ లిమిటెడ్.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top