డీడీ కట్టకుంటే రేషన్‌ డీలర్‌షిప్‌ తొలగించండి

Kcr Mandate to civil supplys department - Sakshi

సమ్మె చేస్తున్న డీలర్ల స్థానంలో కొత్త వారిని నియమించండి

పౌరసరఫరాలశాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: సమ్మెలో పాల్గొంటున్న రేషన్‌ డీలర్లు డిసెంబర్‌ నెలలో బియ్యం పంపిణీకి డీడీలు కట్టకపోతే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. పేదలకు రేషన్‌ పంపిణీకి సహకరించని వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలన్నారు. సమ్మె పేరుతో కొంత మంది రేషన్‌ డీలర్లు డీడీలు కట్టకపోవడంతో డిసెంబర్‌ నెలలో పేదలకు నిత్యావసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్‌లో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌ సీవీ ఆనంద్‌లతో ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 7 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు కట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నారని, మిగిలిన వారు వేతనాలు పెంచాలని, హెల్త్‌ కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టలేదని, అక్కడ డిసెంబర్‌ నెలలో సరుకులు ఇచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వారు సీఎంకు వివరించారు.

దీనిపై స్పందించిన కేసీఆర్‌... డీడీలు కట్టిన డీలర్లకు సరుకులు య«థావిధిగా సరఫరా చేయాలని, కట్టని డీలర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డీడీలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సూచించారు. డీలర్ల సమ్మె పిలుపునకు అర్థం లేదని, అందుకే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top