కేసీఆర్‌ 2.0 @ 365

KCR Completed His Second Year As A Telangana CM - Sakshi

రెండోసారి సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న కేసీఆర్‌

రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి పెద్దపీట

దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపైనే

ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం

కాళేశ్వరం జాతికి అంకితం..
రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ కలసి గత జూన్‌ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయ కట్టుకు నీరందించేందుకు రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి.

తొలి ఏడాదే అమలైన హామీలు.. 
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగిస్తున్నారు. 
అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. 
రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. 

30 రోజుల ప్రణాళిక..
కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణను యథాతథంగా అమలు చేస్తూ పాలనలో గత ఒరవడిని కొనసాగించారు. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను తొలి ఏడాదే అమల్లోకి తెచ్చి సంక్షేమ రంగాన్ని మరింత పటిష్టం చేశారు. పాలనలో సంస్కరణల కొనసాగింపు దిశగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనకు దృష్టిసారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని సిద్ధం చేశారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాప్యాలను తుద ముట్టిం చాలనే లక్ష్యంతో ఈ చట్టాల రూపకల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇక సీఎం దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రీకృతమైంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలతో పరుగులు పెట్టించారు. 

పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు.. 
పొరుగు రాష్ట్రం ఏపీతో సంబంధాలు మెరుగయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి కొంత వరకు ఫలించింది. ఇచ్చిపుచ్చుకునే విధానంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే పలు వివాదాలను పరిష్కరించుకుని పరస్పరం సహకరించుకుంటున్నాయి. 

వివాదస్పదమైన నిర్ణయాలు.. 
రాష్ట్రానికి కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాలను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఎర్రంమంజిల్‌ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ.400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని, ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ.100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.  

ఉద్యోగ, కార్మిక వర్గాల్లో అసంతృప్తి.. 
పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు వంటి హామీల అమల్లో జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన 52 రోజుల సమ్మె సైతం ప్రభుత్వం, ఉద్యోగ, కార్మిక వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇక రెవెన్యూ శాఖలో పెట్రేగిపోయిన అవినీతి నిర్మూలనకు తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టంతో తమ ఉద్యోగ ప్రాధాన్యతలు తగ్గిపోతాయని ఆ శాఖ కింది స్థాయి అధికారుల్లో ఆందోళన నెలకొని ఉంది.
 
మాంద్యం దెబ్బకు కొత్త పనులకు బ్రేక్‌.. 
ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.1,82,087 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రూ.1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాష్ట్ర రాబడులు తగ్గిపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు రాకపోవడంతో 2019–20కి సంబంధించిన బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వం కుదించాల్సి వచ్చింది. దీని ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని, కొత్త పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తొలి ఏడాదే అమలైన హామీలు.. 
– రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్ని కొనసాగిస్తున్నారు. 
– అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5300 కోట్లు ఖర్చు చేస్తోంది. 
– రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. 

నెరవేరాల్సిన హామీల్లో ప్రధానమైవని.. 
– ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ. పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగింపు 
– రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ 
– నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లింపు 
– సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చెల్లింపు 
– ఉద్యోగాల నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 3 ఏళ్లు పెంపు కొనసాగించడం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top