కాళేశ్వరం నీరు.. మరో వారం ఆగాల్సిందే!

Kaleshwaram Water Flow To Mid Manair In August At Karimnagar - Sakshi

15 నాటికి మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీరు 

ముఖ్యమంత్రి పర్యటనతో కాళేశ్వరం పనుల్లో పెరిగిన వేగం

నందిమేడారం నుంచి లక్ష్మీపూర్‌కు తరలిన గోదారి

‘ఎల్లంపల్లి పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఇక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్టు లక్ష్యం 65 శాతం సాఫల్యమైనట్టే. వారం రోజుల్లో మిడ్‌మానేరుకు నీరు విడుదల కావాలని అధికారులను ఆదేశిస్తున్నా...’  – ధర్మపురిలో మంగళవారం మీడియాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

సాక్షి , కరీంనగర్‌: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 25వేల నుంచి 40వేల క్యూసెక్కుల వరద నిరాటంకంగా వచ్చి చేరుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో 19.50 టీఎంసీల నీటి నిల్వ తరువాత 10 గేట్ల ద్వారా మిగతా నీటిని  వదులుతున్నారు. దిగువకు వదిలిన నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గుండా మేడిగడ్డకు చేరి అక్కడి నుంచి గోదావరి నదిలో కలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించే ప్రక్రియలో ప్రధాన జలాశయమైన మిడ్‌మానేరుకు నీటిని ఎత్తిపోయడంలో జరిగిన ఆలస్యం కారణంగానే ఎల్లంపల్లికి వస్తున్న వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం నాటి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో... వారంలోగా మిడ్‌మానేరుకు నీరు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు మిడ్‌మానేరుకు నీరు తరలించే విషయంలో అడ్డంకిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.

నందిమేడారం నుంచి సర్జిపూల్‌కు గోదావరి నీళ్లు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారానికి గోదావరి నీటిని ఇప్పటికే వదిలారు. నందిమేడారం నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని పంప్‌హౌస్‌ మధ్య 15.11 కిలోమీటర్ల పొడవునా టన్నెల్స్‌ ఉన్నాయి. 6వ ప్యాకేజీలో ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా సుమారు కిలోమీటరు పారి అక్కడి నుంచి టన్నెళ్ల ద్వారా 9.5 కిలోమీటర్లు ప్రయాణించి నందిమేడారం పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి. పంప్‌హౌస్‌ నుంచి మేడారం చెరువులోకి అవసరం మేరకు నీటిని ఎత్తిపోశారు. నంది మేడారం చెరువు మత్తడి 233 మీటర్ల ఎత్తులో ఉండగా,  230.55 మీటర్ల నీటిమట్టం ఉంటే లక్ష్మీపూర్‌లోని ఏడు పంపులకు నీటిని తరలించవచ్చు. ఈ నేపథ్యంలో  నందిమేడారం చెరువు నుంచి 7వ ప్యాకేజీలో మల్లాపూర్‌ సొరంగం ద్వారా 11.24 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపూర్‌ సర్జిపూల్‌ పంప్‌హౌజ్‌కు నీటిని విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ మేరకు మేడారంలో నాలుగు గేట్లు ఎత్తి గత సోమవారం ఉదయం నీటిని వదలగా, ఆ రోజు రాత్రి వరకు లక్ష్మీపూర్‌ సర్జిపూల్‌కు చేరుకున్నాయి. మంగళవారం నీటిని తరలించే పనిని ఆపేశారు. మొదట సర్జ్‌పూల్‌ నుంచి పంపుల్లోకి నీటిని తరలించే డ్రాఫ్ట్‌ట్యూబులకు అడ్డంగా ఉన్న గేట్లు మునిగేలా 193.5 మీటర్ల మేర నీటిని నింపారు. గేట్ల నుంచి లీకేజీలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మిగతా సర్జ్‌పూల్‌లను క్రమక్రమంగా పూర్తిస్థాయిలో నింపాలని నిర్ణయించి ఆ మేరకు బుధవారం పనులు చేపట్టారు. అన్ని పరీక్షలు పూర్తయితే వెట్‌ రన్‌ జరపాలని భావిస్తున్నారు. ఇప్పటికే 5పంపుల డ్రైరన్‌ నిర్వహించిన నేపథ్యంలో వెట్‌రన్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సర్జ్‌పూల్‌లో నీటిని 226 మీటర్ల వరకు నింపితే ఏడు పంపులు నడిపించేందుకు వీలవుతుంది. అయితే వెట్‌రన్‌ జరిపిన వెంటనే నీటిని మిడ్‌మానేరుకు తరలించే పరిస్థితి లేదని సమాచారం. సర్జిపూల్‌లో పంపుల పనితీరును పరీక్షించిన తరువాత, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే వారం మిడ్‌మానేరుకు నీరు తరలిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

7వ ప్యాకేజీతోనే ఆలస్యం
కాళేశ్వరం ప్రాజెక్టు ఏడో ప్యాకేజీలో నందిమేడారం రిజర్వాయరు, 11.24 కిలోమీటర్ల టన్నెళ్లు(సొరంగాలు) మాత్రమే ఉన్నాయి. 6, 8 ప్యాకేజీల్లో రెండు చోట్ల భారీ పంప్‌హౌస్‌లు తవ్వాల్సి ఉంది. అయితే 6, 8 ప్యాకేజీ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాగా, ఏడో ప్యాకేజీలోని 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం ప్రధాన సమస్యగా మారినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత టన్నెల్‌ పైనుంచి ఎస్సారెస్పీ వరదనీటి కాలువ, కాకతీయ కాలువ పారుతున్నాయి. భూగర్భం నుంచి తవ్వే టన్నెళ్లకు నీటి ఊట ఎక్కువగా రావడంతో అధికార యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ మార్గంలో నిర్మాణం జరుగుతున్నప్పుడు నాలుగు చోట్ల టన్నెల్‌ల పైభాగం కూలాయి. ఈ నేపథ్యంలో పైభాగం కూలకుండా ఇనుప కడ్డీలు వేస్తూ పైభాగంలో సిమెంటు కాంక్రీటు నింపుతూ ఎట్టకేలకు పనులు పూర్తి చేసినప్పటికీ, టన్నెల్‌లోపల లైనింగ్‌ పనులు పూర్తి కాక కూడా కొద్దిరోజులు ఆలస్యం అయింది. ఇప్పుడు టన్నెళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, బాహుబలి వంటి ప్రధానమైన లక్ష్మీపూర్‌ సర్జిపూల్‌లో నీటిని నింపి పంపుల ద్వారా బయటకు పంపే ప్రక్రియను ఆచితూచి నిర్వహిస్తున్నారు.

సీఎం ఆదేశాలతో పనులు వేగం
ప్రస్తుతం లక్ష్మీపూర్‌ సర్జిపూల్‌కు వచ్చే నీటిని వీలైనంత వేగంగా మిడ్‌మానేరుకు తరలించేందుకు ఇంజినీరింగ్‌ విభాగంతోపాటు పనుల కాంట్రాక్టులు చూస్తున్న కంపెనీల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో లక్ష్మీపూల్‌లోని సర్జ్‌పూల్‌లోని ఏడు పంప్‌లను నడిపించడం ప్రయాసతో కూడుకున్నదిగా ఇంజినీర్లు చెబుతున్నారు. ఏ చిన్న సాంకేతిక లోపం ఎదురైనా, లీకేజీలు జరిగినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నందున సర్జ్‌పూల్‌లో, అండర్‌గ్రౌండ్‌ టన్నెళ్లలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని తేలిన తరువాతే లక్ష్మీపూర్‌ నుంచి నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. సర్జ్‌పూల్‌ మోటార్లు పనిచేస్తే గ్రావిటీ కాలువ ద్వారా 5.770 కిలోమీటర్లు పారి వరద నీటి కాలువ ద్వారా నేరుగా మిడ్‌మానేరుకు గోదావరి జలాలు చేరుతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో పనిచేయించడమే ప్రధానం కానుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారంలోగా నీటిని మిడ్‌మానేరుకు గోదావరి నీటిని తరలించేందుకు కృషి చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top