‘గంటలు గంటలు సమీక్షలు చేసే సీఎం ఎక్కడా..?’

K Laxman Slams TRS Government Over Inter Board Failure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలు, ఇంటర్‌ బోర్డు అవకతవకలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై మంగళవారం ఆయన సీఎస్‌ను కలిశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల్లో తప్పామనే మనోవేదనతో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లక్ష్మణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవ అని మంత్రి, మాస్‌ హిస్టీరియాతో ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.  గంటలు గంటలు సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను వదిలేసి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్‌ ఫలితాల బాధ్యత ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వీటన్నిటిపై న్యాయ విచారణ జరగాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం..
ఫలితాలు తారుమారైన పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలుపుతుంటే నిర్బంధిస్తున్నారని లక్ష్మణ్‌ ఆగ్రహం చేశారు. పోలీస్‌ జులుంతో బీజేపీ కార్యకర్తలను చితకబాదారని ఆరోపించారు. ఇప్పటికే ఎంఎసెట్‌ మూడుసార్లు నిర్వహించారని, గ్రూప్‌ 2 వాయిదా వేశారని విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు తొందరపాటు చర్యలకు దిగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఇంటర్‌ బోర్డు వైఫల్యం, గ్లోబరీనా సంస్థ అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముందు దిష్టి బొమ్మలు దగ్దం చేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top