ఇక జస్టిస్‌ ధర్మాధికారిదే నిర్ణయం

Justice Dharmadhikari Wants To Take Final decision Over Separation Of Power Employees - Sakshi

విద్యుత్‌ ఉద్యోగుల విభజన మధ్యవర్తిత్వం విఫలం

తుది నిర్ణయం తానే తీసుకుంటానని జస్టిస్‌ ధర్మాధికారి ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలతో జస్టిస్‌ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్‌ ఏడాదిగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ముగిసింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ధర్మాధికారి ఆదివారం రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సైతం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు 2015 జూన్‌లో 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా ఏపీకి రిలీవ్‌ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఉద్యోగుల విభజన కోసం ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని గతంలో ధర్మాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు.

రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో 613 మంది ఏపీకి, 504 తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వగా.. మిగిలినవారు ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 256 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని ఏపీ విద్యుత్‌ సంస్థలు తీసుకుంటే, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మందిలో సగంమందిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఆదివారం సమావేశంలో ఆఫర్‌ ఇచ్చాయి.

దీనిని ఏపీ విద్యుత్‌ సంస్థలు తిరస్కరించాయి. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ ముగిసిందని, తానే తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు నివేదిస్తానని పేర్కొంటూ జస్టిస్‌ ధర్మాధికారి సమావేశాన్ని ముగించారు. 2018 నవంబర్‌ 28న సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

మెట్టు దిగినా..: రిలీవైన 1,157 మందిలో తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 504 మందితోపాటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన 256లో సగం మందిని తీసుకోవడానికి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలంగాణ విద్యుత్‌ జేఏసీ నేతలు శివాజీ, అంజయ్యలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి తోడు నాలుగేళ్ల కింద ఏపీ నుంచి 242 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చేర్చుకున్నాయన్నారు. దీంతో మొత్తం 874 మంది ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేయగా, 613 మందిని తీసుకోవడానికి ఏపీ అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు మెట్టు కిందికి దిగినా, ఏపీ విద్యుత్‌ సంస్థలు మొండికేశాయని విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top