లోకాయుక్తగా జస్టిస్‌ సీవీ రాములు

Justice Chinthapanti Venkata Ramulu Appointed As Telangana State Lokayukta - Sakshi

హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ గుండా చంద్రయ్య

సీఎం నేతృత్వంలో ఎంపిక కమిటీ నిర్ణయాలు.. ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చింతపంటి వెంకట రాములు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గుండా చంద్రయ్య నియమితులయ్యారు. అలాగే ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్‌ రిటైర్డ్‌ జడ్జి వొలిమినేని నిరంజన్‌రావు, హెచ్‌ఆర్సీ సభ్యులుగా జిల్లా, సెషన్స్‌ రిటైర్డ్‌ జడ్జి నడిపల్లి ఆనందరావు(జ్యుడీషియల్‌), ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినొద్దీన్‌ (నాన్‌ జ్యుడీషియల్‌) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో లోకాయుక్త, హెచ్‌ఆర్సీ చైర్మన్‌ ఎంపిక కమిటీలు గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేశాయి.

ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లోకాయుక్త, ఉప లోకాయుక్త ఐదేళ్లపాటు, హెచ్‌ఆర్సీ చైర్మన్, సభ్యులిద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన లోకాయుక్త, హెచ్‌ఆర్సీ ఎంపిక కమిటీల సమావేశంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ పాల్గొన్నారు. శాసనసభలో విపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ లండన్‌ పర్యటనలో ఉండటంతో ఆయన తరఫున ఎంఐఎం సీనియర్‌ శాసనసభ్యుడు సయ్యద్‌ పాషా ఖాద్రీ హాజరయ్యారు.

జస్టిస్‌ సీవీ రాములు, జస్టిస్‌ చంద్రయ్య నేపథ్యాలివీ
జస్టిస్‌ సీవీ రాములు (రాష్ట్ర లోకాయుక్త) 
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సమీపంలోని అచ్చన్నపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ప్రాథమిక విద్య అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. 1978లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యాక సీనియర్‌ న్యాయవాది సి.ఆనంద్‌ దగ్గర జూనియర్‌గా చేశారు. ఉమ్మడి ఏపీలో 24ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి 13 ఏళ్లకు పాటు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. 2002 డిసెంబర్‌ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పలు తీర్పులు చెప్పారు. 
 
జస్టిస్‌ జి.చంద్రయ్య (హెచ్చార్సీ చైర్మన్‌) 
ఆదిలాబాద్‌ జిల్లా జొన్నారం మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో 1954 మే 10న జన్మించారు. స్వగ్రామంలో మూడో తరగతి వరకు చదివారు. తపలాపూర్‌లో పదో తరగతి చదివాక ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఇంటర్, బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేశారు. 1980 నవంబర్‌ 6న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మున్సిపల్‌ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వా త శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా తన పరిధిలోని అనేక అంశాలపై కక్షిదారులకు ఉపయుక్తంగా ఉండేలా మానవీయ కోణంలో పలు తీర్పులు చెప్పారు. 2016 మే 9న పదవీ విరమణ చేశారు.  

వొలిమినేని నిరంజన్‌రావ్‌ (రాష్ట్రఉప లోకాయుక్త) 
జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. సీనియర్‌ జిల్లా జడ్జిగా ఉండగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సమర్ధంగా విధులు నిర్వహించారు. దీంతో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది. ఇటీవలే ఆయన న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆయన పనితీరు, సమర్థతను సీఎం కేసీఆర్‌ సైతం పలుమార్లు అభినందించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top