నాన్న ప్రోత్సాహంతోనే..

junior civil judge farheen kouser special interview - Sakshi

ఈ స్థాయికి చేరుకున్నాను

చదువుతోనే సమాజంలో విలువ

ప్రతి ఇల్లాలుకు చదువు తప్పనిసరి

‘సాక్షి’తో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌

మెదక్‌జోన్‌: ‘ఆడపిల్లవు నీకెందుకు ఉన్నత చదువులు అని మేనత్తలు, బంధువులు వారించినా.. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఆడ, మగ చదవాల్సిందే అని నాన్న ప్రోత్సహించారు. ఆయన ప్రోత్భలంతోనే నేడు న్యాయమూర్తిగా రాణిస్తున్నా.’ అని మెదక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌ తెలిపారు. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు..

మేము ఐదుగురు సంతానం
మాది హైదరాబాద్‌. తండ్రి రజాక్, తల్లి సిరాజ్‌ నస్రీన్‌. మేము ఐదుగురు సంతానం. వీరిలో నలుగురుం ఆడపిల్లలం. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అందులో నేను మూడో సంతానం. అమ్మ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. నాన్న లా చదివి వ్యాపారంలో స్థిరపడ్డారు. మా ఐదుగురినీ ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత లా చదివే సమయంలో.. ‘ఆడపిల్లకు ఉన్నత చదువులు ఎందుకు.. చదువు మాన్పించు..’ అంటూ మా మేనత్త, బంధువులు నాన్నకు చెప్పారు. కానీ,  నాన్న మాత్రం చదువుతోనే వాళ్లు సొంతంగా నిలబడతారని చెప్పారు. దీంతో నేను లండన్‌లో ఎల్‌.ఎల్‌.ఎం. పూర్తి చేశా. తర్వాత మొదటిసారి పరీక్ష రాసి జడ్జీగా ఎంపికయ్యా.

ఇల్లాలికి చదువు చాలా అవసరం
ప్రతి ఇల్లాలికి చదువు రావాలి. పిల్లలను పెంచడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లికి చదువు వస్తే పిల్లల భవిష్యత్తు మరింత తీర్చిదిద్దవచ్చు. కుటుంబ బాధ్యతలు సైతం సక్రమంగా నిర్వహించే వీలుంటుంది. ప్రస్తుతం ఆడపిల్లలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది.. అంతేకాదు తమ హక్కుల గురించి మహిళలు తెలుసుకునే వీలుంటుంది.

చదువంటే ఉద్యోగం కాదు
ఉన్నత చదువులు అనగానే కొందరు తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ, చదువంటే ఉద్యోగం కాదు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. విజ్ఞానం పెరిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మంచి ఉద్యోగం సాధించేలా మాత్రమే చదివించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు.

చట్టాలపై అవగాహన అవసరం
మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం. విడాకులు, మెయింటనెన్స్, వరకట్న వేధింపులు, గృహహింస లాంటి కేసుల్లో మహిళలు అధికంగా కోర్టుకు వస్తున్నారు. కానీ, కోర్టుకు వచ్చే మహిళల్లో 90 శాతం మందికి చట్టాలపై అసలు అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం నన్ను చాలా బాధిస్తుంది. మహిళలకు చట్టాల మీద అవగాహన కలగాలంటే చదువే ఏకైక మార్గం.

వృత్తిలో సంతోషం
నాన్న ఎంతో ఇష్టంతో లండన్‌లో నన్ను ఎల్‌.ఎల్‌.ఎం. చదివించారు. ఆ తర్వాత మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యా. సుమారు 18 నెలలుగా న్యాయమూర్తి వృత్తిలో కొనసాగుతున్నా. పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఉన్నత శిఖరాలు చేరడం కష్టమేమీ కాదు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top