తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2వ తేదీకీ.. అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణకు లంకె పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2వ తేదీకీ.. అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణకు లంకె పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రమబద్దీకరణకు జూన్ 2ను కటాఫ్ డేట్‌గా పరిగణించాలని సర్కారు స్థూలంగా ఓ అభిప్రాయానికి వచ్చింది. గత ఏడాది జూన్ 1వ తేదీ లోపు నిర్మితమైన భవనాలు, లే ఔట్లను మాత్రమే క్రమబద్ధీకరించాలని.. ఆ తర్వాత పుట్టుకొచ్చిన వాటిని కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. ప్రభుత్వం మళ్లీ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని(బీపీఎస్) అమలు చేయాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.
అయితే లే ఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) విషయంలో ఇంకా సమాలోచనలు చేస్తోంది. బీపీఎస్‌తో పాటే ఎల్‌ఆర్‌ఎస్‌ను సైతం అమలు చేయాలని భావిస్తే రెండింటికీ కటాఫ్ డేట్‌గా 2014 జూన్ 2ను పెట్టాలని భావిస్తోంది. కటాఫ్ డేట్‌కు ముందు, తర్వాత నిర్మితమైన భవనాలు, లేఔట్లను గుర్తించేందుకు ‘గూగుల్ మ్యాప్స్’ సాయాన్ని తీసుకోవాలని యోచి స్తోంది. కటాఫ్ ఆధారంగా దరఖాస్తుల వడపోత కోసం ‘గూగుల్ మ్యాప్స్’లో ఆయా భవనాలు/లే ఔట్ల చిత్రాలను పరిశీలించనుంది.