స్తంభించిన వైద్యసేవలు

Judas Protest Against National Medical Commission In Hyderabad - Sakshi

కొనసాగుతున్న జూడాల ఆందోళన

సంఘీభావం ప్రకటించిన ప్రొఫెసర్‌ కోదండరామ్, సినీనటులు జీవిత, రాజశేఖర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : వైద్యుల సమ్మెతో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ వైద్యసేవలు స్తంభించిపోయాయి. జూడాలకు మద్దతుగా సీనియర్‌ వైద్యులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆయా ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోగా, గురువారం జరగాల్సిన పలు చికిత్సలు వాయిదా పడ్డాయి. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న రోగులు.. వైద్యసేవలు అందక నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును (ఎన్‌ఎంసీ) వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ జూడా) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ వైద్య మహగర్జన నిర్వహించారు.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్‌ సహా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జూనియర్, కొంత మంది సీనియర్‌ వైద్యులు ఈ మహాగర్జనలో పాల్గొన్నారు. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. మహాగర్జనకు హాజరైన ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్సీ నాగేశ్వర్, సీనీ హీరో జీవితా రాజశేఖర్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది రచన తదితరులు వైద్యులకు సంఘీభావం ప్రకటించారు.

ఢిల్లీలో కూర్చొని నియంత్రణా?: కోదండరాం
ఢిల్లీలో ఎవరో కూర్చుని ఇక్కడ వైద్య వ్యవస్థను నియంత్రించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. ఈ బిల్లును మార్చే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. సినీనటులు జీవితారాజశేఖర్‌ దంపతులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లు చదివి పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు మరోసారి ఎగ్జిట్‌ పరీక్ష పెట్టడం దారుణమన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top