9వ తేదీ వరకే జేఈఈ మెయిన్‌

JEE Main Exams until Jan 9th - Sakshi

నేటి నుంచే పరీక్షలు ప్రారంభం.. రెండ్రోజుల ముందే ముగింపు

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎన్‌టీఏ నిర్ణయం

నిర్ణీత సమయం దాటితే నో ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6 నుంచి 11 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండటంతో పరీక్షలు నిర్వహించే రోజులను తగ్గించింది. 9వ తేదీ వరకే పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా రోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు 10.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో బీఈ/బీటెక్‌ కోసం 9.34 లక్షల మంది.. బీఆర్క్‌/బీప్లానింగ్‌ కోసం  1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖా స్తుల్లో 2.90 లక్షల మంది బాలికలున్నారు. గతేడాది కంటే బాలికల సంఖ్య ఈసారి పెరిగింది. గతేడాది నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 2,74,753 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అదనంగా 15,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 81,413 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

దేశవ్యాప్తంగా 233 కేంద్రాల ఏర్పాటు.. 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాసేందుకు తెలంగాణ నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణకు 233 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో హైదరాబా ద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ జిల్లా కేంద్రా ల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

2 గంటల ముందు నుంచే.. 
సోమవారం ఉదయం ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులను 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థు లను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామంది. మొదటి షిఫ్ట్‌ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండో షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుం చి సాయంత్రం 5:30 వరకు ఉంటుందని తెలిపింది. విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాళ్లలో ఉండాలని పేర్కొంది. విద్యార్థుల హాల్‌టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక ఒరిజినల్‌ ఐడీ కార్డును, హాల్‌టికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించింది. పెన్ను/పెన్సిల్, పేపరు లాంటివి తీసుకురావద్దని, వాటిని పరీక్ష హాల్లోనే ఇస్తామని వివరించింది. ఎలాంటి ఎలక్ట్రా నిక్, జామెట్రీ పరికరాలు తేవద్దని స్పష్టం చేసింది. మొదటిరోజు పరీక్షలను బీఆర్క్‌/బీ ప్లానింగ్‌లలో ప్రవేశాల కోసం (పేపర్‌–2) నిర్వహిస్తారని తెలిపింది. 7, 8, 9 తేదీల్లో బీఈ/బీటెక్‌లలో ప్రవేశాల కోసం (పేపర్‌–1) పరీక్షలుంటాయని ఎన్‌టీఏ వివరించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top