
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జనసేన పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సమ్మె చేపట్టిన 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. సమ్మెకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె, తాజా పరిస్థితులపై ఆయన సోమవారం పార్టీ నాయకులతో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమీక్ష జరిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా.. శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డి, రాణిగంజ్ డిపోకు చెందిన సురేందర్ గౌడ్‌లు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తుందని అన్నారు. కార్మికుల డిమాండ్లు ఎంతవరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కనబెట్టి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఒకే సారి 48వేల మంది ఉద్యోగులను తొలగించడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఇలా చేయడం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.