కృత్రిమ మేధస్సుదే కాలం

Its Time For Artificial Intelligence Says KTR - Sakshi

రాష్ట్రంలో 2020ను ఏఐకు అంకితం చేశాం

హైదరాబాద్‌ను ఏఐ పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం

దావోస్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రభావానికి లోనుకాకుండా ఏ ఒక్క వ్యాపారమూ ఉండదు. ప్రతి వ్యాపార వ్యూహం, విధాన రూపకల్పనలో ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఐటీ, నాన్‌ ఐటీ సంస్థలైనా ఏఐను అనుసరించాల్సిందే. మా కార్యక్రమాలన్నింటిలో ఏఐను అంతర్భాగం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 2020ను ఏఐకు అంకితం చేసింది’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో భాగంగా మంగళవారం అక్కడ ఏఐ పరిజ్ఞానంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ఏఐ సమూలంగా మార్చబోతోందని, ముందుగా ఈ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారు ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో 40 శాతాన్ని ఏఐ జత చేయబోతోందని చెప్పారు. ప్రపంచంలోని 25 ఏఐ పరిశోధనల కేంద్రాల్లో హైదరాబాద్‌ను   

ఒకటిగా తీర్చదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. పౌర సేవలకు గుర్తింపు ధ్రువీకరణ, నిత్యావసర వస్తువుల పంపిణీ, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తు సంస్థల అవసరాలు, జీ2సీ చాట్‌బోట్స్, క్రోడ్‌ కౌంటింగ్‌ వంటి అవసరాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఏఐ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. పౌరులకు రవాణా సమయం తగ్గించేందుకు ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు ఏఐ పరిజ్ఞానం ఆధారంగా రూపొందించిన ట్రాఫిక్‌ నిర్వహణ ప్రయోగాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. కేంద్రం సైతం ఏఐ ఆధారిత కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఈ చర్చలో సింగపూర్‌ ఐటీ మంత్రి ఐ.ఈశ్వరన్, యునిసెఫ్‌ ఈడీ హెన్రిట్ట హెచ్‌.ఫోర్‌ పాల్గొన్నారు.

భారత్‌లో అద్భుత అవకాశాలు
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 20–40 ఏళ్ల వయసున్న యువ జనాభా భారత్‌కు అదనపు బలమన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లిన ఆయన మంగళవారం అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘ఇండియా–ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ నేషన్‌’అనే అంశంపై సీఎఫ్‌బీసీ–18, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ఈ చర్చలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశోధన రంగాన్ని ప్రోత్సహిస్తున్న తీరును వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి ప్రపంచ టాప్‌–5 కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. నివాస సౌలభ్యం పరంగా హైదరాబాద్‌ అత్యుత్తమమైన నగరమని మెర్సర్‌ సంస్థ గత ఐదేళ్లుగా గుర్తిస్తూ వస్తోందన్నారు.

ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్‌ నగరంగా హైదరాబాద్‌ని జేఎల్‌ఎల్‌ గుర్తించిందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే.. పరిశోధన, సమ్మిళిత అభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి అనే మూడు మంత్రాలను అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ చర్చ అనంతరం కేటీఆర్‌ దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలిశారు. రోషే చైర్మన్‌ క్రిస్టోఫర్‌ ప్రాన్జ్‌తో సమావేశమై హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా ఉందని తెలిపారు. ఫార్మాసిటీ, మెడికల్‌ డివైస్‌ పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. హెచ్‌పీ సీఈవో విశాల్‌ లాల్, అపోలో టైర్స్‌ ఉపాధ్యక్షుడు, ఎండీ నీరజ్‌ కన్వర్, కాల్లŠస్‌ బెర్గ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్లెమింగ్‌ బెసెన్‌ బాచర్, పీఅండ్‌జీ దక్షిణాసియా సీఈవో, ఎండీ మాగేశ్వరన్‌ సురంజన్‌ తోనూ మంత్రి సమావేశమయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top