ప్లాట్ల పేరుతో  కొల్లగొట్టారు!

Irregularities in the Allocation of the TNGO Housing Society Plots - Sakshi

అక్రమాలకు అడ్డాగా హైదరాబాద్‌ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ

విలువైన భూమికి రెక్కలు.. అనర్హులకు ప్లాట్లు

చేతులు మారిన కోట్ల రూపాయలు

ఆరోపణలపై సర్కారు విచారణ

ఏసీబీ లేదా సీబీఐ దర్యాప్తునకు కలెక్టర్‌ సిఫారసు

నెలలు దాటుతున్నా పట్టించుకోని సచివాలయ వర్గాలు

అది పేరుకే ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ. కానీ ఎక్కడా సహకార స్ఫూర్తి కనిపించదు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టవు. అనుమతులు, లే అవుట్లు గిట్టవు. సీనియారిటీ పట్టింపు అసలే లేదు. మార్గదర్శకాలను మరుగున పడేశారు. పెద్దల అండతో ఇష్టారాజ్యంగా రూ. వందల కోట్ల భూమికి రెక్కలొచ్చాయి. అడ్డగోలుగా దందాలు సాగించి అందినకాడికి దండుకున్నారు.  – ఇదీ హైదరాబాద్‌ జిల్లా  ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ గురించి క్లుప్తంగా... 

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం సర్కార్‌ కేటాయించిన భూమిని తమకు తోచినట్లు, నచ్చినట్లు పందేరాలు చేసిన భూ కుంభకోణం బట్టబయలైంది. ఈ కేసును ఏకంగా సీబీఐ లేదా ఏసీబీకి అప్పగించి దర్యాప్తు జరిపించాలని, దీని వెనుక పెద్ద తలల బాగోతం బయటపెట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సొసైటీ పాలకమండలి సభ్యుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. 

అంతా మా ఇష్టం! 
రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం గండిపేట మండలం మణికొండ జాగీర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 203/పీ, 204, 205, 208, 209లలో 50 ఎకరాలను ప్రభుత్వం 2003లో హైదరాబాద్‌ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ (టీఎన్జీవోస్‌)కు కేటాయించింది. అయితే ఈ సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపు ఆది నుంచి వివాదాస్పదంగానే మారింది. నిబంధనల ప్రకారం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు మాత్రమే మెంబర్‌షిప్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోని పాలక కమిటీ... అడ్డగోలుగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. నచ్చిన, మెచ్చిన వారిని సభ్యులుగా చేర్చుకొని స్థలాలు కేటాయించారని, ఇందులో గెజిటెడ్‌ హోదా కలిగిన వారికి కూడా స్థలాలను ధారాదత్తం చేశారన్న ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.

సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోగా విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగులకు కేటాయించిన స్థలాలను రద్దు చేసి మరొకరికి కేటాయించిన దాఖలాలున్నాయి. ఇవేగాకుండా తమ కనుసన్నల్లో పనిచేసిన వారికి.. ఆమ్యామ్యా ముట్టజెప్పిన వారికి మాత్రమే ప్లాట్లు దక్కాయి. సభ్యుల నుంచి రూ. నాలుగేసి లక్షల వరకు వసూలు చేయడం ద్వారా రూ. 20 కోట్ల మేర అనధికారికంగా రాబట్టినట్లు తేలింది. సొసైటీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు వచ్చిన అధికారులకు కూడా స్థలాలను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. కాగా, త్వరలో సొసైటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఆధిపత్య పోరులో అనర్హుల పేరిట 168 మంది ఓట్లను తొలగించారు. 

8 నెలలైనా చర్యలు శూన్యం... 
సీబీఐ లేదా ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఏకంగా జిల్లా కలెక్టర్‌ లేఖ రాసి 8 నెలలైనా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ భూ బాగోతం వెనుక పెద్దల హస్తం ఉందని నివేదికలో పేర్కొన్నా విచారణ ముందుకు సాగక పోవడానికి గతంలో ఉద్యోగ సంఘాల్లో కీలకపాత్ర పోషించి సచివాలయంలో చక్రం తిప్పుతున్న ఓ అధికారే కారణమనే ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ కలెక్టర్లు, మాజీ, ప్రస్తుత జిల్లా కలెక్టర్లే కాకుండా ఉద్యోగ సంఘ నేతలు, ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో నివేదిక బుట్టదాఖలవుతోందనే విమర్శలున్నాయి.

అక్రమాల పుట్ట.. సొసైటీ చిట్టా 
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నివేదికలో పేర్కొన్న ప్రకారం సొసైటీకి భూమిని అప్పగించిన అనంతరం ఆ సొసైటీ భూ బదలాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆ భూమి సొసైటీ పేర బదలాయింపు జరగాలి. ఆ తర్వాత సొసైటీ లే అవుట్‌ ప్లాన్‌ తయారు చేసి హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకున్నాకే అర్హులైన ఉద్యోగులకు ప్లాట్లను కేటాయించాల్సి ఉంది. కానీ కనీసం బదలాయింపు ప్రతిపాదనలు కోరకుండా హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికన పేరుతో 2004 నుంచే స్థలాల కేటాయింపు ప్రారంభించారు. ప్లాట్ల కేటాయింపు కూడా అడ్డగోలుగా జరిగింది.

సభ్యుల సీనియారిటీని పట్టించుకోకుండా అర్హులకు ఆర్థిక నష్టం కలిగిస్తూ ఇష్టారీతిన కేటాయింపు జరిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే ఈ సొసైటీలో ప్లాట్లు పొందేందుకు అర్హులుకాగా... ప్రభుత్వ నిబంధనలు, సొసైటీ మార్గదర్శకాలను ఉల్లంఘించి అర్హతలేని ఆనేక మందికి ప్లాట్లను కట్టబెట్టారు. ఈ హౌసింగ్‌ సొసైటీ ఆవిర్భావ స్ఫూర్తి అయిన ఎన్‌జీఓలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని పక్కదోవపట్టిస్తూ 2008 నవంబర్‌ 8న ఏకంగా సొసైటీ నియమావళినే మార్చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉండి రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్న సుపీరియర్‌ ఉద్యోగులై ఉండాలనే అర్హతను చేర్చారు. తద్వారా ఎన్‌జీఓల హక్కులను కాలరాస్తూ ఎన్‌జీఓలకు ప్లాట్ల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన సొసైటీలో కనీసం వారికి సభ్యత్వం పొందే అవకాశం కూడా లేకుండా చేశారు. 

ఎప్పుడు ఏం జరిగిందంటే... 

  • ఈ సొసైటీకి ప్రభుత్వం 2003లో 50 ఎకరాలను కేటాయించగా అప్పటి నుంచి ఆరేళ్లపాటు సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. 
  • సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సొసైటీ తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అప్పటి జిల్లా సహకార అధికారిని విచారణాధికారిగా నియమించింది. 
  • ఆరు నెలలకు కూడా ఎలాంటి నివేదిక రాకపోవడంతో 19 కాలమ్‌ల ఫార్మాట్‌లో వివరాలు సమరి్పంచాలని లేదా భూ కేటాయింపు రద్దు చేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డీసీఓ పంపిన ఫార్మాట్‌లో రికార్డుల్లేవని సర్‌చార్జి కేసులో సికింద్రాబాద్‌ డివిజనల్‌ సహకార అధికారి అధీనంలో రికార్డులు ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు వివరణ ఇచ్చారు. 
  • ఆ తర్వాత పలుమార్లు వివరాలు సమరి్పంచాలని ప్రభుత్వం ఆదేశించినా సొసైటీ నుంచి స్పందన రాలేదు. మూడు రోజుల్లో వివరాలు ఇవ్వకుంటే కేటాయింపు రద్దు చేస్తామని హెచ్చరించడంతో 2017 డిసెంబర్‌లో పాలకమండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం మినిట్స్‌ ఆధారంగా ఐదు అంశాలతో నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సొసైటీ అక్రమాలు వెలుగు చూశాయి. దీనిపై జిల్లా అసిస్టెంట్‌ రిజి్రస్టార్‌ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. 
  • హెచ్‌ఎండీఏ జారీ చేసిన లే అవుట్‌కు విరుద్ధంగా అదనంగా 22 ప్లాట్లను (బై నంబర్‌) సృష్టించారు. ఒక స్థలాన్ని ఇరువురికి కేటాయించడం ద్వారా 23 మంది సభ్యులకు వివాదం సృష్టించారు. 81 మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు ఇటీవల సహకారశాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య విచారణలో తేలింది. 
  • ఇందులో టీఎన్‌జీఓలు కానీ ఏసీబీ, పోలీసు విభాగాలకు చెందిన 22 మందికి ప్లాట్లు కేటాయించారు. సొసైటీ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు నియమించిన విచారణాధికారులకు కూడా ప్లాట్లు ఇవ్వడం, అనుమతుల్లేకుండా ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కలి్పంచిన పంచాయతీ కార్యదర్శికి స్థలం కేటాయించడం గమనార్హం.

 రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తుది నివేదికలో పేర్కొన్న అంశాలివి... 
‘సొసైటీ ద్వారా స్థలాల కేటాయింపులో రూ. కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. అనర్హులకు సీనియారిటీని విస్మరించి ప్లాట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక రికార్డులు కూడా నిర్వహించలేదు. ఇందుకు సొసైటీ మేనేజింగ్‌ కమిటీయే కారణం. పాలకమండలి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా వ్యవహరించింది. ఈ అక్రమాల వెనుక బడా బాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీకి వారి నుంచి ఉన్న అండదండల కారణంగా అక్రమాలకు పాల్పడ్డారని అర్థమవుతోంది. సొసైటీ ద్వారా స్థలాల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కేసును ఏసీబీ లేదా సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలి. కమిటీ సభ్యులతోపాటు ఎలాంటి టైటిల్‌ డీడ్స్‌ లేకుండా అక్రమంగా భవన అనుమతులిచి్చన గ్రామ పంచాయతీపై కూడా చర్యలు తీసుకోవాలి. అనర్హులకు అక్రమంగా కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలి.’ 

అర్హులకే స్థలాలు కేటాయించాం 
అనర్హులకు ఇళ్లను కేటాయించామనడం అవాస్తవం. షేర్‌ క్యాపిటల్‌ కట్టనివాళ్ల సభ్యత్వం రద్దు చేశాం. ఇళ్లు రాలేదనే అక్కసుతో కొందరు మాపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప ఎలాంటి అక్రమాలు జరగలేదు. కాకపోతే నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరిగిన మాట వాస్తవం. గృహావసరాలకు కాకుండా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు.  – టీఎన్‌జీఓ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు 

అర్హతలేని వారికి స్థలాలిచ్చారు... 
1982లోనే సొసైటీ మెంబర్‌గా చేరా. షేర్‌ క్యాపిటల్‌ కూడా చెల్లించా. ఉద్దేశపూర్వకంగా మాకు స్థలాలు కేటాయించకుండా సొసైటీ పాలకవర్గం అనర్హులకు ప్లాట్లను అమ్ముకుంది. ఇళ్ల కేటాయింపులో నిబంధనలు పాటించలేదు. మమ్మల్ని కాదని 89 మందికి అర్హత లేకుండా ఇళ్లను ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయి. టీఎన్‌జీఓ సభ్యులుకాని ఏసీబీ, పోలీసు, డీసీఓలకు ప్లాట్లు ఎలా కేటాయించారో నిగ్గు తేల్చాలి.  – మక్తల కరుణాకార్, రిటైర్డ్‌ తహసీల్దార్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top